Share News

ప్రజలు బుద్ధి చెప్పినా మారని వైసీపీ నేతలు

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:37 PM

ఆత్మీయ సమావేశం పేరుతో శుక్రవారం కొండపిలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడిన అసత్యాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తూర్పు నాయుడుపాలెంలోని తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

 ప్రజలు బుద్ధి చెప్పినా మారని వైసీపీ నేతలు
మంత్రి స్వామి

మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

ఆత్మీయ సమావేశం పేరుతో నాయకుల అబద్ధాలాడటం సిగ్గుచేటని విమర్శ

టంగుటూరు (కొండపి), జూలై11 (ఆంధ్రజ్యోతి): ఆత్మీయ సమావేశం పేరుతో శుక్రవారం కొండపిలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడిన అసత్యాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తూర్పు నాయుడుపాలెంలోని తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నాయకుల అవాకులు, చెవాకులపై స్వామి నిప్పులు చెరిగారు. ప్రజలు 11 సీట్లిచ్చి బుద్ధి చెప్పినా వారికి బుద్ధి రాలేదన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరగని సంక్షేమం, అభివృద్ధిని ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేసి చూపిందని స్వామి తెలిపారు. తల్లికి వందనం పథకంలో చదువుకునే పిల్లలు ఎందరున్నా వారందరికీ డబ్బులు తల్లుల ఖాతాలో వేసినా సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు తాము ఇచ్చినంత మందికి కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2029 తర్వాత వైసీపీ రాష్ట్రంలో కనుమరుగవుతుందని స్వామి అన్నారు. మూడు నియోజకవర్గాలు మారిన మాజీ మంత్రి సురేష్‌ గతంలో ఒకసారి చొక్కా విప్పుకుని, తర్వాత ప్రజలతో చొక్కా విప్పించుకున్నాడని స్వామి విమర్శించారు. ఓటమిపాలైన సురేష్‌ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని స్వామి మండి పడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని మించిన నటుడు ఎవరూ లేరని, కొడికత్తి, బాబాయి గొడ్డలి లాంటి పనులు చేసి బాగా నటించాడని విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలపై జరిగినన్ని అఘాయిత్యాలు ఏరాష్ట్రంలో జరగలేదని, దళితులపై దాడులు జరుగుతుంటే సురేష్‌ నోరు మెదపలేదు ఎందుకు? అని స్వామి పేర్కొన్నారు. రప్పారప్పా అంటూ పిచ్చి మాటలు మాట్లాడితే వైసీపీ రాజకీయాలకి, రౌడీ మూకలకీ కొండపి నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. వైసీపీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం కల్ల మాత్రమేనని, ఎన్ని పగటి కలలు కన్నా మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని స్వామి పేర్కొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:37 PM