Share News

వైసీపీ నేతలు బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:42 PM

వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని మార్కాపురం ఎమ్యెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.

వైసీపీ నేతలు బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్కాపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని మార్కాపురం ఎమ్యెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మార్కాపురం, తర్లుపాడు మండలాల పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తల్లికి వందనం అమలు చేయడంలేదని వైసీపీ నాయకులు నానాయాగీ చేశారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంకంటే మిన్నగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రజా ప్రభుత్వం రూ.13 చొప్పున అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా అన్నదాత సుఖీభవపైనా దుష్ప్రచారం చేశారని, ఇదే నెలలో అన్నదాత సుఖీభవతోపాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీకి ఏం విమర్శలు చేయాలో కూడా పాలుపోక ఫేక్‌ వీడియోలు, వార్తలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. 75 ఏళ్ల వయస్సులో కూడా సీఎం చంద్రబాబు యువకునిలా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లినా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి రాష్ర్టాభివృద్ధికోసం పాటుపడుతుంటే విమర్శలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. అంతేకాక అమరావతి మునిగిపోతోందని, పడవలు తిరుగుతున్నాయని గోబెల్స్‌ ప్రచారం మొదలు పెట్టారన్నారు. ఈ నెల 25న మార్కాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున రెండు మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా రావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకటసత్యనారాయణ, మార్కాపురం ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్‌ గుంటక సుబ్బారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 10:42 PM