xమార్కాపురం జీజీహెచ్ నుంచి వైద్య సామగ్రి తరలింపు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:07 PM
మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) నుంచి వైద్య సామగ్రిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎమ్‌ఈ) డాక్టర్ జి.రఘునందన్ గత నెలలోనే ఆదేశాలు జారీ చేశారు.
పీపీపీ మోడ్‌లోకి వెళ్లడంతో డీఎంఈ ఆదేశం
మెరుగైన వైద్య సేవలు కష్టమే
మార్కాపురం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) నుంచి వైద్య సామగ్రిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎమ్‌ఈ) డాక్టర్ జి.రఘునందన్ గత నెలలోనే ఆదేశాలు జారీ చేశారు. ఏ పరికరాలు ఏ వైద్య కళాశాలకు తరలించాలో ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కాపురానికి వైద్య కళాశాల మంజూరు కావడంతో జిల్లా వైద్యశాలను అప్‌గ్రేడ్ చేసి జీజీహెచ్‌గా మార్పు చేశారు. అప్పట్లో వైద్య కళాశాల స్థాయికి అనుగుణంగా వైద్యులను, సామగ్రిని ఏర్పాటు చేశారు. 150 బెడ్లతో ఉన్న వైద్యశాలను 350 బెడ్లకు పెంచారు. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగాయి. అంతేకాక నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి తరగతులు నిర్వహించేందుకు సకాలంలో అనుమతులు తేలేకపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ఎలాగైనా పూర్తి చేయాలని పీపీపీ విధానంలోకి మార్చారు. ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. త్వరలో టెండర్ దక్కించుకున్న సంస్థ వైద్య కళాశాలను నిర్మించనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆగకుండా మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు ఉన్నపళంగా వైద్య సామగ్రి తరలించడంతో సేవలు మృగ్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
సౌకర్యాలు లేకుంటే వైద్యం కష్టమే
మార్కాపురం జీజీహెచ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కేసులను ఇతర ప్రాంతాలకు తరలించే వాళ్లు. అప్పట్లో కూడా కేవలం చిన్నపాటి వైద్యం మాత్రమే అందించే వాళ్లు. సౌకర్యాల కల్పన వలన కొన్ని శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలు ఏర్పడింది. మెడికల్ కాలేజీకి కేటాయించిన వైద్యులను ఇప్పటికే పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు. అధునాతన వైద్య సామగ్రి తరలిపోతే రోగులకు మెరుగైన వైద్య సేవలు లభించడం కష్టమే. పీపీపీ విధానం ద్వారా టెండర్ దక్కించుకున్న సంస్థ త్వరితగతిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే ప్రజలకు వైద్యసేవలందించే వీలు కలుగుతుంది. అప్పటి వరకైనా మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు వైద్య సామగ్రిని ఉంచితే సరిపోయేదని డివిజన్ ప్రజలు వాపోతున్నారు.
పలు వైద్య కళాశాలలకు తరలింపు
మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న మార్కాపురం సర్వజన వైద్యశాలకు గతంలో 22 రకాలైన అధునాతన వైద్య పరికాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరిధి నుంచి మెడికల్ కాలేజీ పీపీపీ మోడ్‌లోకి వెళ్లనుండడంతో ఇక్కడ ఉన్న వైద్య సామగ్రిని రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలకు తరలించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా 5 రకాలైన వైద్య సామగ్రిని గుంటూరు మెడికల్ కాలేజీకి మూడు రోజుల కిందట తరలించారు. అవేకాక ఇంకా 17 రకాల సామగ్రిని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, విశాఖపట్నం, అనంతపురం, ఒంగోలు, నెల్లూరుతోపాటు మరికొన్ని వైద్య కళాశాలలకు తరలించనున్నారు. ఆయా వైద్య కళాశాలల్లో లేని సామగ్రిని ఇక్కడ నుంచి తరలించనున్నారు. మార్కాపురంతోపాటు పీపీపీ మోడ్‌లోకి తీసుకున్న ఆదోని, పులివెందుల, మదనపల్లె ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లోని సామగ్రిని కూడా ఇదే విఽధంగా తరలించేందుకు ఆదేశాలిచ్చారు.
వైద్య సామగ్రి తరలించాలని ఆదేశాలు అందాయి
రామచంద్రరావు, సూపరింటెండెంట్, జీజీహెచ్, మార్కాపురం
ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న 22 రకాల సామగ్రిని పలు మెడికల్ కాలేజీలకు తరలించాలని డీఎంఈ ఆదేశాలిచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజీ వాళ్లు కొన్ని పరికరాలను తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు కేటాయించిన మేరకు మిగిలిన సామగ్రిని కూడా త్వరలోనే ఇతర కాలేజీల వాళ్లు తీసుకెళ్లనున్నారు. అధునాతన సామగ్రి లేకుంటే మెరుగైన వైద్యం అందించాలంటే కొంత మేర ఇబ్బందులే.