Share News

వాటర్‌ షెడ్‌ పనుల్లో వావ్‌!

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:23 AM

వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్రప్రభుత్వమే మెచ్చి ప్రశంసాపత్రం ఇచ్చి శభాష్‌ అంటూ అభినందించింది.

వాటర్‌ షెడ్‌ పనుల్లో వావ్‌!
కేంద్ర మంత్రి పాటిల్‌ నుంచి అవార్డును స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

జాతీయస్థాయిలో జిల్లాకు రెండో స్థానం

కేంద్ర మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్రప్రభుత్వమే మెచ్చి ప్రశంసాపత్రం ఇచ్చి శభాష్‌ అంటూ అభినందించింది. జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడంతో మంగళవారం ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌.పాటిల్‌ చేతులమీదుగా కలెక్టర్‌ రాజాబాబు ఈ అవార్డును అందుకున్నారు. ఆరో జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు పీసీపల్లి మండలం మురుగుమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైన విషయం విదితమే. 2022-23 సంవత్సరంలో జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులు చేపట్టారు. వాటర్‌షెడ్‌ నిధులు, ఇతర శాఖల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. అందులో భాగంగా రెడ్జ్‌-టు-వ్యాలీ విధానంలో వివిధ రకాలైన సహజ వనరుల యాజమాన్యపు పనులు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాలను పెంపొందించడంలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఖండిత కందకాల పనులు, చిన్న ఊట కుంటలు, పెద్ద ఊటకుంటలు, డగవుట్‌ పాండ్స్‌, అమృత్‌ సరోవర్లు, పూడికతీత పనులు చేయడం ద్వారా దాదాపు 8.21 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని నిల్వ చేశారు. ఇందుకు గాను 51 పనులకు సుమారు రూ.97 లక్షల నిధులు ఖర్చుచేశారు. ఈ పనులలో సాధించిన పురోగతిని వివరించేలా డాక్యుమెంట్‌ చేయించి గతేడాది అక్టోబరులో కేంద్రానికి నామినేషన్‌ పంపించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో కేంద్ర బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించింది. దీంతో జిల్లాకు జాతీయస్థాయిలో రెండో ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో కలెక్టర్‌ రాజాబాబుకు ట్రోఫీ, ప్రశంసాపత్రం, రూ.1.50 లక్షల నగదును అందించింది. ఈ పథకం అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పనులను పర్యవేక్షించిన డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ను కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - Nov 19 , 2025 | 01:23 AM