Share News

అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:10 PM

అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులందరి సహకారంతోనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేశానని గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్లిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు.

అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ,డీఆర్వో ఓబులేశు

తాజా మాజీ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులందరి సహకారంతోనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేశానని గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్లిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రిమ్స్‌లోని ఆడిటోరియంలో అన్సారియాకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత ఏడాది జూన్‌ 27న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తాను విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా జిల్లాలోని పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాలో స్వచ్ఛందసంస్థలతో పాటు వివిధ వర్గాల భాగస్వామ్యులను చేయడం ద్వారా బాల్యవివాహాలు, వెట్టిచాకిరీని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయాన్ని అన్సారియా గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కంటే కూడా ఉద్యోగులకు ఆయా విషయాలలో అవసరమైన అవగాహన కలిగించి దిశానిర్దేశం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలనేది తన ఆలోచన విధానమన్నారు. జిల్లాలో 14 నెలలకు పైగా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఇదే విధానాన్ని తాను అనుసరించానని తెలిపారు. జిల్లాలో సీఎం పర్యటనలు విజయవంతంలోనూ, విజయవాడ వరదల సమయంలో జిల్లా నుంచి అవసరమైన ఆహార పదార్థాలను పంపించడంలోనూ ప్రభుత్వ సిబ్బంది, డ్వాక్రా మహిళల పాత్రను అన్సారియా కొనియాడారు. అంతకు ముందు వివిధశాఖల అధికారులు కలెక్టర్‌ అన్సారియాతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో చినఓబులేషు, ఆర్డీవోలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:10 PM