మెరుగైన ఫలితాలు వచ్చేలా పనిచేయాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:21 PM
ప్రాథమిక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టేలా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయకుండా చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టేలా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. ఈ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక కలెక్టరేట్ నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ-దాని అనుబంధరంగాల్లో నెలకొన్న పరిస్థితులపై దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలు, పరిస్థితులకు తగినట్లుగా వృద్ధి సాధించేలా శాఖాపరమైన ప్రతిపాదనలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రాథమిక రంగం నుంచి వస్తున్న ఉత్పత్తి, వాటికి మరింత విలువ జోడింపుపై ఉన్నతాధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అమలు చేసి రసాయన వినియోగాన్ని తగ్గించి మెరుగైన ఉత్పత్తి సాధించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన స్థాయిలో యూరియా, విత్తనాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. బ్లాక్ బర్లీ పొగాకు ఎట్టిపరిస్థితుల్లోనూ సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మంచిలాభాలు వచ్చే పంట మార్పిడి వైపు రైతులను మళ్లించేలా కృషి చేయాలని ఆదేశించారు. పశువుల దాణాను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న క్యాటిల్ షెడ్స్‌ను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. పాలు, మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైక్రో ఇరిగేషన్ పరికరాలను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ద్వారా మరింత ఉత్పత్తి వచ్చేలా అఽధికారులు, ఉద్యోగులు వినూత్నంగా ఆలోచించి పనిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీవో సుధాకర్‌రెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, గోపీచంద్, హరికృష్ణ, వరలక్ష్మి, సుజన్‌కుమార్, రవికుమార్, రమేష్, సుభాషిణి తదితరులు ఉన్నారు.