పైసలిస్తేనే పనులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:49 AM
ముండ్లమూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి చిరునామాగా మారింది. పైసలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. అవి ముట్టకపోతే సంబంధిత ఫైలుకు కొర్రీ వేస్తూ నెలల తరబడి తిప్పుకుంటున్నారు. సిబ్బంది, వీఆర్‌వోలు, సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అవినీతికి కేరాఫ్ తహసీల్దార్ కార్యాలయం
ముండ్లమూరులో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్ల ఇష్టారాజ్యం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
శంకరాపురం 1బీ రికార్డు మాయం
ముండ్లమూరు, ఆగస్టు 9 (ఆంధ్ర జ్యోతి) : ముండ్లమూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి చిరునామాగా మారింది. పైసలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. అవి ముట్టకపోతే సంబంధిత ఫైలుకు కొర్రీ వేస్తూ నెలల తరబడి తిప్పుకుంటున్నారు. సిబ్బంది, వీఆర్‌వోలు, సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పైఅధికారుల పేర్లు చెప్పి వేలాది రూపాయలు గుంజుకొంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నా, ఒకరి భూమికి మరొకరి పేరు పడితే సరిచేసేందుకు వేల రూపాయలు వసూలు చేసిన వీఆర్‌వోలు లేకపోలేదు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూ లు చేస్తున్నారు. ఇటీవల సచివాలయాల్లో ఉద్యోగంలో చేరిన గ్రామ సర్వేయర్ల పని ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అన్నచందంగా ఉంది. కొలతలకు వెళ్లిన సర్వేయర్లు తాము చెప్పిందే వేదమంటూ వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎకరానికి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుంటు న్నారు. ముండ్లమూరులోని సర్వే నంబరు 200లో 120 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం ఎఫ్‌ఎల్‌ఆర్‌లో 48 మందికి సమాన భాగాలుగా ఉన్నట్లు చూపుతోంది. అయితే ఆ భూములను విజయవాడ ప్రాంతానికి చెందిన కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2019-22 మధ్య కొనుగోలు చేశారు. సమభాగాలుగా రావాల్సిన భూమిలో కొందరి పేరుపై ఐదు ఎకరాలు, మరికొందరి పేరుతో ఆరు ఎకరాలు చూపి ఆన్‌లైన్ చేయించుకున్నారు. అసలు హక్కుదారులు కాని వారు కూడా భూములను విక్రయించగా కొనుగోలు చేసిన వారి పేర్లు ఆన్‌లైన్‌లో చేర్చారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సూత్రధారులుగా పనిచేసిన అధికారులకు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధులు అండగా నిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మారెళ్ల పంచాయతీ పరిధి గంగన్నపాలెంలో ఇద్దరి మధ్య ఏర్పడిన భూవివాదంలో కూడా పెద్దఎత్తున నగదు చేతులు మారింది. ఈవిషయమై ఒక వర్గం వారు ఇటీవల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కలసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంకా మండలంలోని పలు గ్రామాల్లో భారీ ఎత్తున రికార్డులు తారుమారు చేసి అర్హులైన భూ యజమానులకు సైతం అన్యాయం చేశారు. వీరిలో కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు.
శంకరాపురం గ్రామ 1బీ రికార్డు మాయం
మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన సంబంధించి మాన్యువల్ 1బీ రికార్డు మాయమైంది. గ్రామానికి చెందిన మేడికొండ కృష్ణారావు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా 2018 నుంచి 2022 వరకు పనిచేసిన అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుత తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆ సమయంలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్‌లు, ఇద్దరు డీటీలు, అప్పట్లో పనిచేసి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఉన్న ఒక వీఆర్వోపై పోలీసు స్టేషన్ కేసు నమోదు చేశారు. ఇటీవల అనేకమంది భూములు కొన్న వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌వోలను ఆశ్రయించి పనులు చేయించుకుంటున్నారు.
రీసర్వేలో తప్పుల తడకలు
రీసర్వేతో చాలామంది రైతుల పొలాల విస్తీర్ణం తగ్గింది. తమ భూమి తగ్గిందంటూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని వీఆర్‌వోలను, సర్వేయర్లు అందినకాడికి దండుకుంటున్నారు. రికార్డుల్లో విస్తీర్ణం సరి చేస్తామంటూ వేలాది రూపాయలు గుంజుకుంటున్నారు.
ఫిర్యాదులు అందితే చర్యలు
ఎల్.లక్ష్మీనారాయణ, తహసీల్దార్, ముండ్లమూరు
మండలంలో వీఆర్వోలు కానీ, గ్రామ సర్వేయర్‌లుకానీ పనులు చేస్తామంటూ నగదు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరూ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఉంటే పనిచేస్తారు. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సస్పెండ్‌కు సిఫార్సు చేస్తా.