Share News

మహిళా మార్ట్‌ మూత

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:42 AM

ఒంగోలులోని మహిళా మార్ట్‌ మూతపడింది. క్రయవిక్రయాలకు సంబంధించి బాధ్యుడిగా ఉన్న అధికారి చేతివాటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రతి రోజూ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును మార్ట్‌ బ్యాంక్‌ ఖాతాలో జమచేయకుండా ఆయన తన జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మహిళా మార్ట్‌ మూత
ఒంగోలులో మూసివేసి ఉన్న మహిళా మార్ట్‌

పర్యవేక్షకుడైన మార్కెటింగ్‌ అధికారి జేబులోకి లావాదేవీల సొమ్ము?

పొదుపు సభ్యులకు శఠగోపం

ఒక్కో గ్రూపు నుంచి రూ.1,500 వసూలు

ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వని వైనం

ప్రస్తుతం డబ్బుల్లేవ్‌.. సరుకుల్లేవ్‌!

వైసీపీ హయాంలో ఆర్భాటంగా ప్రారంభం

రెండేళ్లు కూడా పూర్తికాకుండానే క్లోజ్‌

ఒంగోలులోని మహిళా మార్ట్‌ మూతపడింది. క్రయవిక్రయాలకు సంబంధించి బాధ్యుడిగా ఉన్న అధికారి చేతివాటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రతి రోజూ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును మార్ట్‌ బ్యాంక్‌ ఖాతాలో జమచేయకుండా ఆయన తన జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేసమయంలో సరుకులు కూడా మాయమయ్యాయి. సదరు ఉద్యోగికి తాజాగా ఒంగోలు సిటీ మిషన్‌ మేనేజర్‌ (సీఎంఎం)-2గా బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. నెల రోజులుగా మహిళా మార్ట్‌ మూతపడటంతో పొదుపు సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాము చెల్లించిన సొమ్ముకు బాధ్యులెవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు2 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలనే లక్ష్యం.. ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ధ్యేయం అంటూ గత వైసీపీ హయాంలో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళా మార్ట్‌ రెండేళ్లకే మూతపడింది. పొదుపుసంఘాల సభ్యులు తయారుచేసే సరుకులు, తినుబండారాలను మార్ట్‌ల ద్వారా విక్రయించి ఆదాయ వనరులు సమకూర్చాలని భావించారు. నగరంలోని ఊరచెరువులో గతంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రం (నైట్‌ షెల్టర్‌)లో మహిళా మార్టును ఏర్పాటు చేశారు. ప్రారంభ సమయంలో ప్రతి పొదుపు సంఘం నుంచి రూ.1,500 ముక్కుపిండి మరీ వసూలు చేశారు. అందుకుగాను ఒక్కో సభ్యురాలు రూ.150 చొప్పున చెల్లించారు. ఆతర్వాత పొదుపు సంఘాలు తయారు చేసే నిత్యావసర సరుకులు కాకుండా ప్రైవేటు మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసి పొదుపు సభ్యుల చేత బలవం తంగా అమ్మకాలు చేయించారు. అయితే ప్రస్తుతం ఆ మహిళా మార్ట్‌ మూతపడింది. దాని బాధ్యతలను పర్యవేక్షిస్తూ, క్రయవిక్రయా లకు బాధ్యుడుగా ఉన్న అధికారి చేతివాటం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సేల్స్‌ గర్ల్స్‌గా ఆర్పీలు

మహిళా మార్ట్‌ను లాభాల బాటలో నడిపించేందుకు ఆర్పీలను సేల్స్‌ గర్ల్స్‌గా మార్చేశారు. రోజుకు ఇద్దరికి చొప్పున మార్ట్‌ డ్యూటీలు వేయడంతోపాటు వారికి టార్గెట్‌లు నిర్ణయించారు. వారి పరిధిలోని పొదుపు సంఘాల సభ్యులకు సరుకులు అంటగట్టారు. మార్ట్‌లో సరుకు మాకొద్దంటూ కొందరు అభ్యంతరం తెలిపినా మెప్మా రూల్స్‌ పాటించాల్సిందేనంటూ కొనుగోలు చేయించారు. దీంతో లాభాల బాటలోనే నడిచిన మార్ట్‌ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయింది. సొమ్ములు కూడా మాయం కావడంతో ఆర్పీలు తలపట్టుకు కూర్చున్నారు. మార్ట్‌ ప్రారంభం సమయంలో నాటి వైసీపీ ప్రభుత్వం ఆదేశాలంటూ ఖచ్చితంగా రూ. 1500 చెల్లించాల్సిందేనని వసూలు చేసిన ఆర్పీలు, ఆ తర్వాత సరుకులు కూడా కొనాల్సిందేనని పొదుపు సంఘాల సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆర్పీల చొరవతో మార్ట్‌ లాభాల బాటలోనే నడిచినా, ప్రస్తుతం కనీసం కేజీ కందిపప్పు కూడా లేని దారుణ పరిస్థితిలో ఉంది. దీంతో లాభాలు, నిల్వ సరుకులు,నగదు ఏమయ్యాయి? అని పొదుపు సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మార్ట్‌ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆర్పీలు ఇప్పుడు సంఘాల సభ్యులకు ఏమి చెప్పాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు.

సరుకులు... సొమ్ము రెండూ మాయం..!

జిల్లాలో ‘జగనన్న మహిళా మార్ట్‌’లను 2023 సెప్టెంబరు 23న ప్రారంభించారు. ఒంగోలులో మార్ట్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుమారు రూ.50 లక్షల వ్యయంతో ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికి రూ.6లక్షల వరకు ఆదాయం రాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.28లక్షలు లాభాల్లో ఉంది. వాటితోపాటు నిత్యావసర సరుకులు స్టాక్‌ రూ.25లక్షల వరకూ ఉండింది. ఫర్నిచర్‌ విలువ మరో రూ.15లక్షల వరకూ ఉంటుంది. గతేడాది డిసెంబరు వరకు లాభాల బాటలోనే నడిచిన మార్ట్‌ ఈ ఏడాది జనవరి నుంచి మార్టులో సరుకులు.. సొమ్ము మాయమయ్యాయి. అయితే మెప్మా ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం అంతా తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. అయితే తాము చెల్లించిన సొమ్ము ఏమైంది? వాటిని ఎవరు తిరిగి చెల్లిస్తారు? మార్ట్‌ మూతకు ఎవరు బాధ్యులు? అన్న ఆందోళన సంఘ సభ్యుల్లో కనిపిస్తోంది.

Updated Date - Sep 03 , 2025 | 01:42 AM