మహిళ మరింత దర్జాగా!
ABN , Publish Date - May 31 , 2025 | 02:26 AM
నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే పింఛన్‌ల పెంపుపై తొలి సంతకం చేయగా, ఇటీవల ఉచిత సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. తాజాగా కడపలో జరిగిన టీడీపీ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో శుభవార్త చెప్పారు.
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
సూపర్ సిక్స్‌లో మరో హామీ అమలు దిశగా అడుగులు
సీఎం ప్రకటనతో సర్వత్రా హర్షం
జిల్లాలో 13 లక్షల మందికి లబ్ధి
ఒంగోలు, కార్పొరేషన్, మే 30 (ఆంధ్రజ్యోతి): నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే పింఛన్‌ల పెంపుపై తొలి సంతకం చేయగా, ఇటీవల ఉచిత సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. తాజాగా కడపలో జరిగిన టీడీపీ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో శుభవార్త చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు లోటు బడ్జెట్, ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. జిల్లాలో సుమారు 26లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. అందులో సగానికిపైగా మహిళలే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ ప్రకారం 13లక్షల మంది మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం లభించనుంది.
ఆర్టీసీపై ఆర్థిక భారం.. అయినా అమలు
ప్రకాశం రీజియన్‌లో ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలోని 866 గ్రామాలకు అనుసంధానంగా 20 బస్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే 484 ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 95 అద్దె ప్రాతిపదికన (హయ్యర్) నడుస్తు న్నాయి. ఈ బస్సులన్నీ రోజుకు 2లక్షల కిలోమీటర్లు ప్రయాణికుల కోసం రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో1.5లక్షల మం ది ప్రయాణిస్తున్నారు. దీంతో రోజుకు రీజియన్‌కు రూ.77.51లక్షల ఆదాయం వస్తోంది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించనుండటంతో రోజుకు రూ.38.50 లక్షల భారం ప్రభుత్వంపై పడనుంది.