Share News

ప్రభుత్వ పథకాల పేరుతో మహిళకు టోకరా

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:59 PM

సచివాలయం నుంచి వస్తున్నానంటూ పరిచయం చేసుకొన్నాడు ఆ ఆగంతుకుడు. మీకు ప్రభుత్వం నుంచి కుట్టు, వాషింగ్‌ మిషన్లు ఉచితంగా ఇప్పిస్తామని నమ్మబలికి వేర్వేరు చోట్ల ముగ్గురి వద్ద రూ.70వేలు అపహరించి పరారయ్యాడు. ఈ సంఘటన ఒంగోలు నగరంలో ఆదివారం చోటుచేసుకుంది.

ప్రభుత్వ పథకాల పేరుతో మహిళకు టోకరా

ముగ్గురు వద్ద నుంచి రూ.70వేల నగదు అపహరణ

ఒంగోలు క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): సచివాలయం నుంచి వస్తున్నానంటూ పరిచయం చేసుకొన్నాడు ఆ ఆగంతుకుడు. మీకు ప్రభుత్వం నుంచి కుట్టు, వాషింగ్‌ మిషన్లు ఉచితంగా ఇప్పిస్తామని నమ్మబలికి వేర్వేరు చోట్ల ముగ్గురి వద్ద రూ.70వేలు అపహరించి పరారయ్యాడు. ఈ సంఘటన ఒంగోలు నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. ముందుగా ఇందిరా కాలనీ 11 లైనులో నివాసం ఉండే ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిన ఆగంతకుడు తాను గతంలో వలంటీర్‌గా పని చేశానని, ప్రస్తుతం మమ్మల్ని సచివాలయంలో ఉద్యోగులుగా తీసుకున్నారని చెప్పాడు. మీకు ఉచితంగా ప్రభుత్వం వాషింగ్‌, కుట్టుమిషన్లు ఇస్తోందని, అందుకు ఆధార్‌కార్డు జిరాక్స్‌ కావాలని చెప్పాడు. దీంతో ఆదిలక్ష్మి తన కుమార్తె కావ్యకు ఆధార్‌కార్డు ఇచ్చి జిరాక్స్‌ తీసుకురావాలని పంపింది. ఈలోపు ఆగంతకుడు హడావుడి చేసి ఓ స్టీల్‌ప్లేట్‌లో చీర, రూ.20 వేల నగదు పెట్టి ఫొటో తీయాలని చెప్పాడు. దీంతో ఆదిలక్ష్మి అలాగే తీసుకు రాగా ఫొటో తీసే సమయంలో మీరు కట్టుకున్న చీర బాగాలేదని, లోపలకు వెళ్లి చీర మార్చుకునిరావాలని చెప్పాడు. దీంతో ఆమె లోపలకెళ్లి వచ్చే సరికి రూ.20 వేల నగదు తీసుకుని పరారయ్యాడు.


కమ్మపాలెంలోనూ అదే తీరుతో బురిడీ..

స్థానిక కమ్మపాలెం రెండో లైన్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్న జంపాని వరలక్ష్మి ఇంటికి స్కూటీపై ఓ యువకుడు వెళ్లాడు. మీకు ప్రభుత్వ పథకాలు అందాయా అని అడగా, రాలేదని చెప్పింది. నగదు వచ్చే పథకం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉందని చెప్పి పక్క వీధిలో నివాసం ఉంటున్న ఆమె సోదరిని పిలిపించాడు. ఇరువురు రెండు ప్లేట్లలో కొత్త చీర, నగదు పెట్టి ఫొటో దిగాలని చెప్పాడు. వరలక్ష్మమ్మ రూ.30వేలు, చీర ప్లేటులో పెట్టింది. ఆమె సోదరి రూ.20వేలు, చీర ప్లేటులో పెట్టి తెచ్చారు. వారి ఇరువురికి మాయమాటలు చెప్పిన ఆగంతకుడు ఇంట్లోకి వెళ్లి ఆధార్‌కార్డులు తీసుకురావాలని చెప్పి పంపాడు. అనంతరం పళ్లెంలో ఉన్న రూ.50వేలు తీసుకుని పరారయ్యాడు. అయితే బాధితులు ఇరువురు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

Updated Date - Oct 12 , 2025 | 10:59 PM