వనితా.. ఓ వ్యాపార వేత్త!
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:28 AM
మహిళాభి వృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ముఖ్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా పేద, మధ్యతరగతి మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకా రం పలికింది.
పొదుపు మహిళలతో ‘తృప్తి’ క్యాంటీన్లు
రుణ సదుపాయం కల్పించి ఆర్థిక భరోసా
మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలో 55 క్యాంటీన్లు
మహిళాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి
ఒంగోలు కార్పొరేషన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మహిళాభి వృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ముఖ్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా పేద, మధ్యతరగతి మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకా రం పలికింది. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించ డంతోపాటు వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉండేలా ప్రభుత్వం మరో అడుగు ముందుకే సింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ‘తృప్తి’ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు తొలుత నెల్లూరు పట్టణంలో పైలట్ ప్రాజెక్టుగా మేలో క్యాంటీన్‌ను ప్రారంభిం చగా,శనివారం విజయవాడలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్‌లు ప్రారంభించారు. త్వరలోనే ఏపీ మెప్మా, శారా ప్రాజెక్టు ఉమ్మడి భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 750 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, ఇతర మునిసిపాలిటీలలో సుమారు 55 ‘తృప్తి’ క్యాంటీన్‌లు తెరవనున్నారు. ఈ దిశగా మెప్మా ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
నిర్వహణ విధానం ఇలా
తృప్తి క్యాంటీన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వమే సహకారం అందించనుంది. 20-12 సైజు కంటైనర్లను సమకూర్చడంతోపాటు, ప్రతి నలుగురు మహిళలను ఒక యూనిట్‌గా తీసుకుని వారికి క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనుంది. అందుకోసం వంటశాల నిర్వహణపై శిక్షణ అందించనుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకునిఎలక్ట్రిక్ పరికరాలను, సోలార్ విద్యుత్‌తో వంటశాలను తీర్చిదిద్దనున్నారు. ఒక్కో క్యాంటీన్ నిర్వహణకు రూ.16.40 లక్షలు అవసరం ఉందని పురపాలక శాఖ అంచనా వేసింది. దీంతో యూనిట్ సభ్యులుగానలుగురు ఒక్కొక్కరు రూ.3.10 లక్షల చొప్పున రూ.12.40 లక్షలు మొత్తం 75శాతం పెట్టుబడిగా నిర్ణయించారు. మిగిలిన నిధులను శారాస్ ఏజెన్సీ ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తారు. ఈ నిధులతో కంటైనర్, యంత్ర పరికరాలు, సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్, ఇతర అవసరాలను మెప్మా ప్రాజెక్టు అందజేస్తారు.
ప్రతి రోజూ రూ. 10వేలకుపైనే ఆదాయం
తృప్తి క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి, ఆదాయ వ్యయాలను అధికారులు లెక్కకట్టారు. వారి అంచనా ప్రకారం నెలవారీ టర్నోవర్ సుమారు రూ.6.39 లక్షలు వస్తుందని భావిస్తుండగా, అందులో నిర్వహణ ఖర్చు రూ.3.92 ఖర్చులు పోను రూ.2.46 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్యాంటీన్లలో ఆహార పదార్ధాల ధరలకు బయట మార్కెట్‌లో ధరలకు పెద్దగా వ్యత్యాసంఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 55 క్యాంటీన్‌లు
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేయనున్న ‘తృప్తి’ క్యాంటీన్‌లు జిల్లాలో 55 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదట జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని ప్రగతిభవన్, జీజీహెచ్ ఆసుపత్రి వద్ద, నెల్లూరు బస్టాండ్, రైల్వేస్టేషన్, గుంటూరు రోడ్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు మెప్మా, కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాలను గుర్తించారు.