Share News

పశ్చిమంలో గాలివాన

ABN , Publish Date - May 07 , 2025 | 12:32 AM

పశ్చిమ ప్రకాశంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. ఓవైపు ఈదురు గాలులు, మరోవైపు పిడుగులతో భీతావహ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోయారు.

పశ్చిమంలో గాలివాన
పెనుగాలులకు తర్లుపాడు మండలం ఓబాయపల్లెలో విరిగిపడిన బొప్పాయి చెట్లు

దెబ్బతిన్న బొప్పాయి, అరటి తోటలు

పలుచోట్ల పిడుగులు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

మార్కాపురం, మే 6 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రకాశంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. ఓవైపు ఈదురు గాలులు, మరోవైపు పిడుగులతో భీతావహ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం రాత్రి 7.30 వరకూ కురిసింది. ముఖ్యంగా డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో ఈదురుగాలుల ప్రభావానికి బొప్పాయి, అరటి తోటలు నేలకొరిగాయి. తర్లుపాడు మండలంలో బొప్పాయి చెట్లు విరిగిపో యాయి. కలుజువ్వలపాడు పంచాయతీలోని ఓబాయపల్లి, లక్ష్మక్కపల్లి, కొండారెడ్డిపల్లెలో ఎక్కువుగా బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రూ.2కోట్ల మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల పిడుగులు పడటంతో చెట్లు కాలిపోయాయి. మార్కాపురంతోపాటు తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, కంభం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం, వైర్లు తెగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో సాయంత్రం 4.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. మార్కాపురం పట్టణంలోని పలు శివారు కాలనీల్లో రోడ్లపై నీళ్లు పారాయి. మెయిన్‌బజార్‌లలో కూడా సైడు కాలువలు నిండి రహదారులపై మురుగు నీరు చేరింది.

Updated Date - May 07 , 2025 | 12:32 AM