ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా?
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:14 AM
జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు ధరలు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరగనుంది.
అజెండాలో 11 అంశాలు
జిల్లాలో వర్షాభావం
ధరలు సరిలేక రైతుల్లో ఆందోళన
పూర్తిగా ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు ధరలు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో 14 అంశాలు అజెండాలో ఉనప్పటికీ ప్రధానమైన శాఖలకు చెందినవి 11 ఉన్నాయి. వీటితోపాటు ఇతర సమస్యలపై కూడా చర్చించి ఉపశమనం కల్పించాలని ప్రజానీకం కోరుతోంది. ఇప్పటివరకు జరిగిన సమావేశాలను పరిశీలిస్తే అజెండాలో పది అంశాలకుపైగా ఉన్నా కేవలం నాలుగైదింటిపై మాత్రమే అరకొరగా చర్చ చేసి మమ అనిపిస్తున్నారు. ఈసారి కూడా ఒక పూట మాత్రమే సమావేశం జరగనుండటంతో ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరుగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి ఆయా సమస్యల పరిష్కారంపై చర్చ జరిగే విధంగా వ్యవహరించాల్సి ఉంది. సమావేశంలో ప్రధానంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రోడ్లు, భవనాలు, విద్యుత్, విద్యాశాఖ, వ్యవసాయ, దాని అనుబంధ శాఖలు, సాంఘిక సంక్షేమం, ప్రజా రవాణా శాఖ కార్యకలాపాలపై సమీక్ష జరగనుంది. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరిగితే ప్రజలకు కొంతమేరకైనా మేలు చేకూరుతుంది.