ఆకాంక్ష నెరవేరేనా!?
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:39 AM
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందా? నిరీక్షణకు తెరపడుతుందా.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా..? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశం వచ్చింది. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు పలుమార్లు ఇందుకు సంబంధించి గట్టి హామీలు ఇచ్చారు.
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఆశలు
ప్రతి సందర్భంలోనూ ఘంటాపథంగా చెప్తున్న టీడీపీ నేతలు
నెలన్నర క్రితం ఈతరహా అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
నెలలోపు ప్రతిపాదనలు ఇవ్వాలని తాజా కేబినెట్ భేటీలో నిర్ణయం
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందా? నిరీక్షణకు తెరపడుతుందా.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా..? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశం వచ్చింది. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు పలుమార్లు ఇందుకు సంబంధించి గట్టి హామీలు ఇచ్చారు. అయితే ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. స్థానికంగా అధికారపార్టీ నేతలు పదేపదే చెప్పడం తప్ప అసలు ప్రభుత్వంలో ప్రత్యేక జిల్లాపై దృష్టి ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇటీవల ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టిపెట్టి చేపడుతున్న చర్యలు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ప్రతిపాదనలపై నియమించిన కమిటీని నెల రోజులలోపు నివేదిక ఇవ్వాలని కేబినెట్ సూచించింది.
ఒంగోలు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనగణన జరగనుంది. అది ప్రారంభమైతే ఆ సమ యంలో పంచాయతీ నుంచి జిల్లాల వరకు సరిహద్దుల మార్పు సాధ్యం కాదు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం నిర్ణయిస్తే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు అవకాశం ఉండదు. అంటే ఈ ఏడాది డిసెంబరులోపే జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వ పెద్దలు గుర్తించి నెలలో మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు ఇవ్వాలని బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు జరగాల్సింది. దశాబ్దాల కాలంగా పశ్చిమప్రాంత ప్రజలు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోరుతున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న ఒంగోలుకు పశ్చిమప్రాంతంలోని మార్కాపురం డివిజన్‌లో ఉన్న ప్రాంతాల నుంచి రావాలంటే 100 నుంచి 150 కి.మీ ప్రయాణించాలి. జిల్లా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పథకాల అమలును పర్యవేక్షించాలన్నా ఒక రోజులో వెళ్లి వచ్చే అవకాశం లేదు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు ఇతరత్రా రంగాల్లోనూ ఆ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉంది. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉంది. ఇదే డిమాండ్‌తో పలు సందర్భాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. అయితే ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా గత వైసీపీ ప్రభుత్వం ఒంగోలుకు సుదూరంగా ఉండే పశ్చిమప్రాంతాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచి ఇక్కడికి 35 నుంచి 45 కిలోమీటర్లలోపు ఉండే అద్దంకి, కందుకూరులను బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కలిపింది. హేతుబద్ధంగా లేకుండా చేసిన విభజనపై అన్ని ప్రాంతాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వారి ఆకాంక్షను అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ గుర్తించింది. గత ఎన్నికలకు ముందు పలు సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్‌లు మార్కాపురం కేంద్రంగా పశ్చిమప్రాంతాన్ని కొత్త జిల్లాగా అలాగే కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ఒంగోలు కేంద్రంగా ఉండే జిల్లాలో కలిపేందుకు హామీ ఇచ్చారు.
ప్రజల్లో పెరిగిన నమ్మకం
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు హామీ నెరవేరుతుందని ప్రజలు ఆశించారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పశ్చిమప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు జిల్లా ఏర్పాటు తథ్యమని గట్టిగా చెబుతూనే వస్తున్నారు. అయితే ఏడాది దాటినా కొలిక్కి రాకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నెలన్నర క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ప్రతిపాదనల పరిశీలనకు ఏడుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయడం కొంత నమ్మకాన్ని పెంచింది. తాజాగా బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగి సదరు కమిటీ నివేదికను నెలలో ఇవ్వాలని సూచించడం మరింత నమ్మకాన్ని పెంచింది.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
వచ్చే ఏడాది జనగణన ప్రారంభం కానుండటంతో ఆ లోపే జిల్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అందుకోసం నెలలో మంత్రివర్గ ఉపసంఘం నుంచి నివేదికను ప్రభుత్వం కోరిందని అధికార పార్టీ వర్గాల సమాచారం. కాగా మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అన్న విషయాన్ని టీడీపీ గుర్తించిందని, అందుకు అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని జిల్లా మంత్రి డాక్టర్ స్వామి చెప్పారు. నిజానికి ఈ పాటికే ఆ హామీ అమలు జరిగేదని, అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీల హద్దులు, మార్పులపై ప్రభుత్వానికి అనేక వినతులు అందుతుండటంతో పరిశీలనకు ఉపసంఘం ఏర్పాటు చేసిందన్నారు. త్వరితగతిన ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కోరిందన్నారు.