Share News

చివరి భూములకు నీరొచ్చేనా?

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:16 AM

సాగర్‌ నీరు పుష్కలంగా సరఫరా అవుతున్నప్పటికీ రైతుల మధ్య అవగాహన లేమితో చివరి భూముల వారికి కష్టాలు తప్పడం లేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల్లో పూడిక తీయడం, చిల్లచెట్ల తొలగింపు పనులు చేపట్టి రైతులకు నీటి సరఫరాకు అనుకూలంగా అభివృద్ధి చేశారు.

చివరి భూములకు నీరొచ్చేనా?
ముడివేముల మేజర్‌లో డీవీఎన్‌ కాలనీ వద్ద అతితక్కువగా ప్రవహిస్తున్న నీరు

ముడివేముల మేజర్‌కు ఏటా ఇదే పరిస్థితి

ఎగువన ఉన్న రైతుల అధిక వినియోగంతో దిగువ ఆయకట్టుకు రాని వైనం

వారబందీ ఏర్పాటు చేసుకోవాలంటున్న అధికారులు

త్రిపురాంతకం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ నీరు పుష్కలంగా సరఫరా అవుతున్నప్పటికీ రైతుల మధ్య అవగాహన లేమితో చివరి భూముల వారికి కష్టాలు తప్పడం లేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల్లో పూడిక తీయడం, చిల్లచెట్ల తొలగింపు పనులు చేపట్టి రైతులకు నీటి సరఫరాకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతం మేజర్ల ద్వారా నీరు విడుదల చేసినప్పటికీ ఎగువన ఉన్న రైతులు వినియోగించుకుంటూ నీటిని అడ్డుకోవడం వలన కింది భూముల రైతులు వరి పంట వేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మేజర్‌ పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మొత్తం 12 మేజర్లలో పెద్దది ముడివేముల కాలువ. మేజర్‌ అని పేరుకు మాత్రమే కానీ ఏటా ముడివేముల వరకు నీరు రావడం కష్టంగానే మారుతుందని రైతులు అంటున్నారు. దాదాపు 11కిలో మీటర్ల పొడవున ఉన్న ఈ మేజర్‌కు ప్రస్తుతం 35 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేజర్‌ కింద దాదాపు 7,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రధాన కాలువ నుంచి మేజరుకు వెళుతున్న ప్రారంభంలో దాదాపు 3 కిలో మీటర్ల వరకు ఉన్న ప్రవాహం రానురాను తగ్గుతోంది. ఆ తరువాత 7 కిలో మీటర్ల వరకు నీరు పూర్తిగా తగ్గి కనిపిస్తోంది. అంటే దాదాపు మిగిలిన 4 కిలోమీటర్ల వరకు నీరు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ఎగువన నీటి వినియోగం అధికంగా ఉండటమే కారణం. సాధారణంగా వరినాట్లు కూడా పైభాగం నుంచి క్రమేణా కింది ప్రాంత రైతులు వేయడం పరిపాటి. కానీ.. ఏటా ఇదే పరిస్థితి అని తమకు నీరు రావడం అనుమానమేనని కింది భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో రైతుల మధ్య కూడా అవగాహన ఉండాలని పగలు ఒక ప్రాంతం, రాత్రి పూట మరోప్రాంతం రైతులు నీటిని వినియోగించుకునేలా వారి మధ్య వారబందీ తరహా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పై భాగంలో ఉన్న రైతులు అడ్డుకట్టలు వేయకుండా కనీసం వచ్చే నీటిని వదిలినా చాలావరకు సమస్య ఉత్పన్నం కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చివరి భూముల రైతులకు చిక్కులు తప్పేలా లేవన్నది స్పష్టమవుతోంది.

Updated Date - Sep 13 , 2025 | 01:16 AM