Share News

ఘాట్‌ రోడ్డు విస్తరణ జరిగేనా..?

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:37 PM

గిద్దలూరు - నంద్యాల మధ్య గల నల్లమల ఘాట్‌ రోడ్డు విస్తరణ కోసం వాహన చోదకులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అదిగో పులి.. ఇదిగో మేక అంటూ పాలకులు ఘాట్‌ రోడ్డు విస్తరణపై రోజుకో మాట చెప్తున్నారే తప్ప వాస్తవానికి ఏ ఒక్కటీ అమలు కావడం లేదు.

ఘాట్‌ రోడ్డు విస్తరణ జరిగేనా..?
నల్లమల ఘాట్‌ రోడ్డులో మలుపు వద్ద ప్రమాదానికి గురైన లారీ (ఫైల్‌)

నిత్యం ఏదో ఒక ప్రమాదం 8 స్తంభిస్తున్న ట్రాఫిక్‌

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

గిద్దలూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు - నంద్యాల మధ్య గల నల్లమల ఘాట్‌ రోడ్డు విస్తరణ కోసం వాహన చోదకులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అదిగో పులి.. ఇదిగో మేక అంటూ పాలకులు ఘాట్‌ రోడ్డు విస్తరణపై రోజుకో మాట చెప్తున్నారే తప్ప వాస్తవానికి ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. దాంతో ఈ రోడ్డులో రోజుకో ప్రమాదం జరిగి గంటల సమయం ట్రాఫిక్‌ స్తంభిస్తుండడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అనంతపురం నుంచి గిద్దలూరు మీదుగా అమరావతి వరకు రోడ్డు విస్తరణ చేయాలని తలపెట్టింది. ఈ రోడ్డు విస్తరణతోపాటు అమరావతి నుంచి అనంతపురం వరకు కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డును కూడా చేపట్టాలని ప్రతిపాదించింది. ముందుగా ఉన్న రోడ్డును విస్తరించాలన్న తలంపుతో అనంతపురం నుంచి గిద్దలూరు వరకు, గిద్దలూరు నుంచి గుంటూరు వరకు రోడ్డు విస్తరణ కోసం టెండర్లు పిలిచింది. రాజకీయ కారణాలతో అనంతపురం నుంచి గిద్దలూరు వరకు టెండర్లు రెండుసార్లు పిలిచినప్పటికీ రద్దవుతూ వచ్చాయి. పదేళ్లు గడిచినా విస్తరణ పనులు మొదలు కాలేదు. గిద్దలూరు నుంచి గుంటూరు వరకు రూ.3500కోట్లతో గత టీడీపీ హయాంలోనే రోడ్డు పనులు మొదలు కావడం, వినుకొండ వరకు విస్తరణ పూర్తి కావడం జరిగింది. ప్రభుత్వం మారడంతో వినుకొండ నుంచి గుంటూరు వరకు విస్తరణ జరుగలేదు. అయితే అనంతపురం నుంచి గిద్దలూరు వరకు ఉన్న టెండర్‌లో నంద్యాల - గిద్దలూరు మధ్య గల ఘాట్‌ రోడ్డు విస్తరణ కూడా ఉన్నది. మొత్తం టెండర్‌ ఆగిపోవడంతో ఘాట్‌ రోడ్డు విస్తరణ పనులు కూడా ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన అనంతరం రెండవ పర్యాయం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ విస్తరణ పనులపై ప్రజలు, వాహన చోదకులు ఆశలు చిగురించాయి. గత వైసీపీ పాలకులు గిద్దలూరు మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ హైవేను పులివెందుల మీదుగా మార్చుకోవడంతో ఇక అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల ప్రజలు గిద్దలూరు వరకు పాత రోడ్డుపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకుంది. మిగతా రోడ్డు విషయం అటుంచితే గిద్దలూరు-నంద్యాల మధ్య గల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఘాట్‌ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య 60 కిలోమీటర్లు ఉండగా, ఇందులో దిగువమెట్ట నుంచి గాజులపల్లె మధ్య 25 కిలోమీటర్ల మేర దట్టమైన నల్లమల అడవిలో అనేక కీలకమైన మలుపులతో రోడ్డు ఉన్నది. కొన్ని చోట్ల ఒక వాహనం మాత్రమే పట్టేంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఘాట్‌ రోడ్డులో చాలా భాగం అటు ఎత్తుగానో, ఇటు తగ్గుగానో ఉంటుండడంతో తర చూ వాహనాలకు బ్రేకులు ఫెయిల్‌ అయి రక్షణ గోడలను, బ్రిడ్జిల భాగాలను గుద్దుకుని ప్రమాదాలకు గురవుతూ రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడమో, పడిపోవడమో జరుగుతున్నాయి. దాం తో తరచూ ట్రాఫిక్‌ స్తంభించి పోతున్నది. ప్రమాదాలకు పగలు, రాత్రి తేడా ఉండదు. ఈ రూటులో ఎప్పుడు టాఫ్రిక్‌ స్తంభించిపోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంటున్నది. దానికితోడు ప్రకాశం, నంద్యాల జిల్లాల సరిహద్దులో ఈ ఘాట్‌ రోడ్డు ఉండడం, కొంతభాగం గిద్దలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో, మరికొంత భాగం నంద్యాల జిల్లాలోని సిరివెళ్ల, మహానంది పోలీసుస్టేషన్ల పరిధిలో ఉంది. ప్రమాదం జరిగిన స్థలం ఎవరిదో తెలుసుకోవడానికి గంటల సమయం పడుతున్నది. దానికితోడు ఈ ఘాట్‌ రోడ్డులో సెల్‌ సిగ్నల్స్‌ అందవు. ప్రమాదం జరిగిందంటే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రమాదం జరిగిన విషయం కూడా పోలీసులకు చాలా ఆలస్యంగా తెలుస్తున్నది. పోలీసులు క్రెయిన్లను తీసుకుని వెళ్లి రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలను పక్కకు తీసుకుని పోయే వరకూ గంటల తరబడి ఘాట్‌ రోడ్డులో బిక్కుబిక్కుమంటూ వాహనచోదకులు, ప్రయాణికులు గడపాల్సిందే. తాగేందుకు కనీసం మంచినీరు కూడా దొరకదు. ఈ ప్రాంతం టైగర్‌ జోన్‌ కింద ఉండడంతో పులులు, ఇతర అటవీ జంతువులు వస్తాయేమోనని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనంతపురం - గిద్దలూరు వరకు 4 లైన్ల రోడ్డు మంజూరైనట్లు, ఇందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు రోజుకో వార్త వస్తుందేతప్ప ఇందుకు సంబంధించిన టెండర్లు వేయడం గానీ, ఇతరత్రా పనులు జరుగక పోవడంతో రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల-గిద్దలూరు మధ్య గల ఘాట్‌ రోడ్డునైనా తొలివిడతగా విస్తరిస్తే ఈ జాతీయ హైవేపై ప్రమాదాలు తగ్గుతాయని, ట్రాఫిక్‌ స్తంభించి పోయే అవకాశం ఉండదని ప్రయాణికులు, వాహన చోదకులు కోరుతున్నారు. పాలకులు రోడ్డు విస్తరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Jun 03 , 2025 | 10:37 PM