చంద్రన్న రుణం తీర్చుకుంటాం
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:18 AM
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోవాలంటే చంద్రన్న మార్కాపురం జిల్లా పేరుతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
ఇక ఏటా పండుగలా సీఎం పుట్టినరోజు
మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోవాలంటే చంద్రన్న మార్కాపురం జిల్లా పేరుతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలపడంతో ఆ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కూటమిలోని పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే నారాయణరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు ఓట్లు దండుకుని ఈ ప్రాంతానికి పలు విధాలుగా అన్యాయం చేశారని విమర్శించారు. ఆనాడు జిల్లాల పునర్విభజనలో మార్కాపురం కేంద్రంగా జిల్లా చేసేందుకు అవకాశం ఉనప్పటికీ పట్టించుకోకుండా నయవంచనకు గురిచేశారన్నారు. కలసివచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరులతో పోరాటం చేస్తే నాటి వైసీపీ ప్రభుత్వం అణగదొక్కిందన్నారు. 60రోజులపాటు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షకు కూర్చుంటే బలవంతంగా దీక్షలను నిలిపివేయించిందని మండిపడ్డారు.
చంద్రన్న రాకతో మారిన తలరాత
అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా మార్కాపురం పట్టణంలో మూడు రోజులపాటు ఉండి ఇక్కడే జన్మదిన వేడుకలు జరుపుకున్న చంద్రబాబు పశ్చిమ ప్రజల అవసరాన్ని అర్థం చేసుకున్నారని నారాయణరెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు చేసిన ఉద్యమాన్ని తెలుసుకున్నారన్నారు. అప్పట్లో ఆయన ప్రధానంగా రెండు హామీలు ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా మార్కాపురం ఇస్తానని, వెలిగొండను పూర్తిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆయన జిల్లాను ప్రకటించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. ఇకపై చంద్రబాబు పుట్టినరోజును ఏప్రిల్ 20వ తేదీని ఈ ప్రాంత ప్రజలు పండుగలా జరుపుకుంటామన్నారు. నూతన జిల్లాలోని యువత భవిష్యత్ మారబోతోందన్నారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పన జరుగుతుందన్నారు. ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే జలవనరులశాఖ మంత్రి రామానాయుడు మూడు పర్యాయాలు ప్రాజెక్టును పరిశీలించారన్నారు. 2026 చివరినాటికల్లా పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రాజెక్టు ప్రారంభవంతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు చంద్రన్నను గుండెల్లో పెట్టుకుని పూజిస్తారన్నారు.
ప్రతిపక్ష నాయకులు విమర్శలు మానుకోవాలి
ప్రతిపక్ష నాయకులు నేటికీ విమర్శలు చేయడం మానుకోలేదని కందుల అన్నారు. వారు ఇవ్వకపోయినా ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం జిల్లా ప్రకటించేసరికి దాని వలన ఉపయోగం ఏంటని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. జిల్లా ఏర్పడి అభివృద్ధి జరగడం ప్రతిపక్ష పార్టీకి ఇష్టం లేదేమో అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, స్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులకు నారాయణరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు ప్రజా సంఘాలు, మార్కాపురం సాధన సమితి నాయకులు, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, బెల్లంకొండ విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్ పాల్గొన్నారు.