వెలుగుచూసేనా?
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:28 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ఎట్టకేలకు సెక్షన్ 51 విచారణ మొదలుకానుంది. విచారణాధికారిగా నియమితులైన రాష్ట్ర సహకార అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ మంగళ, బుధవారాల్లో ఒంగోలులో తొలివిడత విచారణ చేపట్టనున్నారు.
డీసీసీబీలో అక్రమాలపై ఎట్టకేలకు సెక్షన్ 51 విచారణ
తొలివిడతగా నేడు, రేపు చేపట్టనున్న విచారణాధికారి
ఆయన నియామకంపై ఆది నుంచి వివాదాలు
తాజాగా ప్రభుత్వానికి ఫిర్యాదులు
ముందుగానే బ్యాంకు ఉద్యోగులతో సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు
ఒంగోలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ఎట్టకేలకు సెక్షన్ 51 విచారణ మొదలుకానుంది. విచారణాధికారిగా నియమితులైన రాష్ట్ర సహకార అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ మంగళ, బుధవారాల్లో ఒంగోలులో తొలివిడత విచారణ చేపట్టనున్నారు. ఆ మేరకు బ్యాంకు, సహకారశాఖ అధికారులకు సమాచారం అందింది. అయితే విచారణాధికారిపై తొలి నుంచి వివాదాలు ఉన్నాయి. తాజాగా కూడా పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. అంతకు మించి నెల క్రితమే కొందరు బ్యాంకు ఉద్యోగులు ఆయన్ను కలిశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులతో బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలు ఏ మేరకు వెలుగు చూస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు త్రిసభ్య కమిటీల పాలన కొనసాగింది. ఆ సమయంలో నాటి పాలకవర్గంలోని వారు, కొందరు బ్యాంకు ఉద్యోగులు బరితెగించి భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీసీసీబీలో జరిగిన అవకతవకలపై పెద్దఎత్తున పాలకపెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. స్వయంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను మంత్రి డాక్టర్ స్వామి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తొలుత ప్రాథమిక విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాలతో త్రిసభ్య కమిటీతో కలెక్టర్ అన్సారియా నియమించారు. గత ఏడాది నవంబరులో త్రిసభ్య కమిటీ దాదాపు రెండు వారాలపాటు అనేక అంశాలను పరిశీలించి భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఈమేరకు కలెక్టర్‌కు కమిటీ నివేదిక సమర్పించారు. దాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి పంపుతూ సమగ్ర విచారణ చేసి బ్యాంకులో అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చేందుకు సెక్షన్ 51 విచారణ చేయించాలని సిఫార్సు చేశారు.
స్పందించని సహకార అధికారులు
డీసీసీబీపై సెక్షన్ 51 విచారణ విషయంలో తగు స్థాయిలో సహకారశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదు. ఆ మాటకు వస్తే బ్యాంకుపై వచ్చిన ఆరోపణలు, ఇతర సహకార శాఖ అంశాలపై తొలి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దాని వల్లనే విచారణాధికారిగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఒక అధికారి పేరును సూచిస్తే అందుకు విరుద్ధంగా రాష్ట్ర సహహకారశాఖ కమిషన రేట్‌లోని అదనపు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న గౌరీశంకర్‌ను ఉన్నతాధికారులు సూచించినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. దాని వల్లనే విచారణలో జాప్యం జరిగింది. ఈలోపు పలు ఆరోపణలపై అప్పుడు ఇక్కడ డీసీవోగా ఉన్న శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి కలెక్టర్ సరెండర్ చేశారు. తర్వాత ఇందిరాదేవిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆ పరిణామాలు కూడా పెద్ద రచ్చకు దారితీశాయి.
విచారణాధికారిపై ఫిర్యాదులు
దాదాపు ఆరేడునెలల తర్వాత కూడా గతంలో ఉన్నతాధికారులు సూచించిన గౌరీశంకర్‌నే విచారణాధికారిగా నియమించగా ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా కూడా పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. గతంలో విశాఖ జిల్లాలో కొన్ని కీలక సహకార సంస్థలపై విచారణ సమయంలో సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నాయని, అలాగే ఇక్కడి బ్యాంకు అధికారులు కూడా కొందరు ముందుగానే అతనిని కలిశారని, దాని వల్ల సక్రమంగా విచారణ సాగదన్న ఫిర్యాదులు కొందరు చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో డీసీసీబీలో అక్రమాలపై సెక్షన్ 51 విచారణకు నియమితులైన సహకారశాఖ అదనపు రిజిస్ట్రార్ గౌరీశంకర్ మంగళవారం ఒంగోలుకు వస్తున్నారు. విచారణ సమయంలో ఆయనకు సహాయంగా ఉండేందుకు ప్రస్తుతం విజయవాడలో డీఎల్‌సీవో కేడర్‌లో ఉన్న పి.కిరణ్‌కుమార్, గుంటూరు డీఎల్‌సీవో ఆఫీసులోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ జె.జయదాస్‌లను నియమించినట్లు సమాచారం. కాగా విచారణాధికారి తొలివిడత మంగళ, బుధవారాల్లో కొంతమేర విచారణ నిర్వహించనున్నారు. అనంతరం కూడా రెండు, మూడు విడతలుగా విచారణ ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా గతంలో కలెక్టర్ నియమించిన లోకేశ్వరరావు కమిటీ అనేక అంశాలను లోతుగానే పరిశీలన చేసి భారీగానే అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుత సెక్షన్ 51 విచారణ ఎలా సాగుతుంది? అవకవకలను నిగ్గుతేలుస్తారా? అవినీతి, అక్రమాలు వెలుగుచూస్తాయా? అన్నది వేచిచూడాల్సి ఉంది.