Share News

విద్యార్థుల హాజరుపై సాకులెందుకు?

ABN , Publish Date - Dec 18 , 2025 | 10:33 PM

విద్యార్థుల హాజరులో తేడాలపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా సాకులు వెతుకులాడుకోవడం సరికాదని కేంద్ర ప్రభారి అధికారి (కేంద్ర ప్రభుత్వ మత్స్య, పశు సంవర్థక డెయిరీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌) వీరగంధం శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు

విద్యార్థుల హాజరుపై సాకులెందుకు?

ఆశ్రమ పాఠశాల తీరుపై అసహనం

వైద్యశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల సందర్శన

చెంచులతో మాటామంతీ.. ఆనక రైతులతో సమావేశం

వైపాలెం మండలంలో పర్యటించిన కేంద్ర ప్రభారి అధికారి

ఎర్రగొండపాలెం రూరల్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల హాజరులో తేడాలపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా సాకులు వెతుకులాడుకోవడం సరికాదని కేంద్ర ప్రభారి అధికారి (కేంద్ర ప్రభుత్వ మత్స్య, పశు సంవర్థక డెయిరీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌) వీరగంధం శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని శాంతినగర్‌, వెంకటాద్రిపాలెం, వీరభదాప్రురం, కొత్తపల్లి, బోయలపల్లిలో ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, మార్గనిర్దేశం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలో పర్యటించారు. ముందుగా శాంతినగర్‌లోని ఆశ్రమపాఠశాలను తనిఖీచేశారు. విద్యార్థుల హాజరు, వసతులు, ఉపాధ్యాయ సిబ్బంది, వంటశాల, బాత్రూం తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థుల హాజరు(20)కి, రికార్డులో(45) సంఖ్యలో తేడాను గుర్తించి ఏటీడబ్ల్యూవో, హెచ్‌ఎంను ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానం చెప్పడంపై శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాటామంతీ చేశారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. శాంతినగర్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెంచు కుటుంబాలు ఆయనకు వివరించారు. వెంకటాద్రిపాలెంలోని పీహెచ్‌సీలో రక్త పరీక్ష కేంద్రాన్ని, కాన్పుల గది తదితర పరిశీలించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. బీపీ, షుగర్‌ కేసుల వివరాల నమోదులో తేడా ఉందని సరిచేసుకోవాలని సూచించారు. వీరభద్రాపురంలోని హెల్త్‌ సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని సిబ్బంది ఆయన దృష్టికి తెచ్చారు. కొత్తపల్లిలోని పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలకు ఆట స్థలం లేదని, ఉన్నత పాఠశాలగా మార్చాలని కోరారు. బోయలపల్లి సచివాలయంలో రైతులతో మాట్లాడారు. సబ్సిడీపై యంత్రాలు, నీటి సమస్య ఉందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు నీతి ఆయోగ్‌ విభాగం ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కలెక్టర్‌తో పాటు భారత ప్రభుత్వానికి నివేదికలను అందజేస్తామని శ్రీనివాస రావు చెప్పారు. ఆయా కార్యక్రమాలలో సీపీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, సీడీపీవో హేమలత భాస్కర్‌, డాక్టర్లు కోటా నాయక్‌, నబీ రసూల్‌, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సుజాత, విజయలక్ష్మి, ఎంఈవోలు ఆంజనేయులు, మల్లునాయక్‌, ఏవోకే నీరజ, కొల్ల మని తేజ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 10:33 PM