ఎక్కడి చెత్త అక్కడే!
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:19 PM
ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మునిసిపాలిటీల్లో పారిశుధ్యం పడకేసింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఉన్న కొద్ది మంది రెగ్యులర్ సిబ్బందితో అధికారులు పనులు చేయించినా ప్రయోజనం కన్పించడం లేదు. ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తూ కంపుకొడుతున్నాయి. సమస్యలను పరిష్కరించాలని తొమ్మిది రోజులుగా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కార్మికులు ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కొనసాగుతున్న మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె
తీవ్రమవుతున్న ఆందోళన
రెగ్యులర్ సిబ్బందితో పనులు చేపట్టినా కనిపించని ప్రయోజనం
కంపుకొడుతున్న పట్టణాలు
ప్రజలను వెంటాడుతున్న వ్యాధుల భయం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
కనిగిరి మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులు 75 మంది ఉన్నారు. వీరిలో 17 మంది మాత్రమే విధుల్లో పాల్గొంటున్నారు. మిగిలిన వారంతా సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న వారితోపాటు మరో 8 మందిని తీసుకొని అధికారులు పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. అంత తక్కువ మందితో పారిశుధ్య పనులు చేయించడం కష్టంగా మారింది. దీంతో ఎక్కడ చెత్త కుప్పలు అక్కడే ఉన్నాయి.
గిద్దలూరు మునిసిపాలిటీలో ప్రధాన వీధులను మాత్రమే ఆరుగురు పర్మినెంట్ పారిశుధ్య కార్మికులు, 25 కొవిడ్ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ఇళ్ల వద్దకు వచ్చే 35 చెత్తరిక్షాలు, పుష్‌కాట్‌లు కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా నడవడం లేదు. దీంతో మునిసిపల్ అధికారులు చెత్తను చేరవేసే మూడు ట్రాక్టర్లను నేరుగా ఇళ్ల వద్దకు పంపిస్తూ అరకొరగా చెత్తను సేకరిస్తున్నారు. ట్రాక్టర్లు వెళ్లలేని చిన్నచిన్న వీధుల్లోని ప్రజలు చెత్తాచెదారాన్ని ఇళ్ల బయట, కాలువల్లో వేస్తున్నారు.
ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మునిసిపాలిటీల్లో పారిశుధ్యం పడకేసింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఉన్న కొద్ది మంది రెగ్యులర్ సిబ్బందితో అధికారులు పనులు చేయించినా ప్రయోజనం కన్పించడం లేదు. ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తూ కంపుకొడుతున్నాయి. సమస్యలను పరిష్కరించాలని తొమ్మిది రోజులుగా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కార్మికులు ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఒంగోలు, కార్పొరేషన్, జూలై20 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆదివారంతో తొమ్మిదో రోజుకు చేరింది. వందలాది మంది కార్మికులు చీపురు చేత పట్టకపోవడంతో చెత్త సమస్య రోజు రోజుకూ అధికమవుతోంది. రోజువారీ ఇళ్ల నుంచి చెత్తను సేకరించేవారు రాకపోవడంతో చెత్త డబ్బాలు నిండిపోతున్నాయి. ఒంగోలు నగరంతోపాటు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, పొదిలి, దర్శి మునిసిపాలిటీల్లో పారిశుధ్య పరిస్థితి పరమ అధ్వానంగా తయారైంది. సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా పర్మినెంట్ కార్మికులతో చెత్త సేకరణకు చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా కార్మికులు లేకపోవడం సమస్యగా మారింది. జిల్లావ్యాప్తంగా 1,803 మంది పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఒంగోలు కార్పొరేషన్, ఇతర మునిసిపాలిటీలలో కలిపి 105 మంది రెగ్యులర్ కార్మికులు మాత్రమే ఉన్నారు. అంతతక్కువ మందితో వీధులను శుభ్రం చేయించడం, మురుగు తొలగించడం కష్టంగా మారింది. దీంతో అధికారులు నానాతంటాలు పడుతున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లో రోజువారీ పనివేళల కంటే అదనంగా మరో గంట పనిచేయిస్తున్నప్పటికీపారిశుధ్యం మెరుగుపడటం లేదు.
ప్రజల్లో ఆందోళన
జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వీధుల్లో చెత్తపేరుకుపోయి కంపుకొడుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే దోమల దాడి పెరిగింది. ఇప్పుడు కాలువల్లో మురుగు కూడా తీసే వారు లేకపోవడంతో అవి పొంగి రోడ్డుపైనే నీరు ప్రవహిస్తోంది. దీంతో వ్యాధుల భయం ప్రజలను వెంటాడుతోంది.
మునిసిపాలిటీల వారీగా కార్మికుల వివరాలు ఇవీ..
మునిసిపాలిటీ ఆప్కాస్ కొవిడ్ రెగ్యులర్
ఒంగోలు కార్పొరేషన్ 681 150 80
మార్కాపురం 290 - -
గిద్దలూరు 57 25 6
కనిగిరి 150 15 15
చీమకుర్తి 140 - 4
దర్శి 100 - -
పొదిలి 90 - -
మొత్తం 1508 190 105