కల నెరవేరబోతున్న వేళ..
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:25 AM
డీఎస్సీ అభ్యర్థుల తుది ఎంపికకు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి మంగళగిరిలోని పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అక్కడి నుంచి డీఈవో కార్యాలయానికి సమాచారం అందింది.
డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక షురూ
రేపటి నుంచి మంగళగిరిలో ఫైనల్ ప్రక్రియ ప్రారంభం
డీఈవో, సిబ్బందికి విద్యాశాఖ కమిషనర్ పిలుపు
నేడు 2వ విడత సర్టిఫికెట్ల పరిశీలన.. తర్వాత తుది జాబితా
డీఎస్సీ అభ్యర్థుల తుది ఎంపికకు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి మంగళగిరిలోని పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అక్కడి నుంచి డీఈవో కార్యాలయానికి సమాచారం అందింది. ఎంపిక ప్రక్రియకు డీఈవో, సంబంధిత సెక్షన్ అసిస్టెంట్, ఏపీవోలు రావాలని కోరారు. ఇప్పటికే మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనను విజయవంతంగా ముగించారు. వీరిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడంతో దరఖాస్తు సమయంలో వీరు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి మిగిలిన పోస్టులకు తర్వాత మెరిట్ వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానిన్తున్నారు. వీరికి సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం మెసేజ్‌లు, కాల్ లెటర్లు పంపనున్నారు. మంగళవారం వీరి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. బుధవారం పూర్తి వివరాలతో ఫైనల్ ప్రక్రియ అయిన అభ్యర్థుల ఎంపికకు అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది.
ఒంగోలు విద్య, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి) : టీచర్ ఉద్యోగం సాధించాలన్న వారి కల సాకారం కాబోతోంది. డీఎస్సీ నియామకాలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. చివరిదైన ఎంపిక ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. జిల్లాలో మెగా డీఎస్సీలో 672 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రభు త్వ, జడ్పీ యాజమాన్యంలో 599, ముని సిపల్ యాజమాన్యంలో 30, గిరిజన స్కూళ్లలో 43 పోస్టులు ప్రకటించారు.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
డీఎస్సీలో ప్రకటించిన 657 పోస్టులకు అంతే మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. వారిలో 652 మంది హాజరయ్యారు. అందరి సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. మిగిలిన ఐదుగురిలో ముగ్గురు ఇతర ఉద్యోగాల్లో స్థిరపడినందున అన్‌విల్లింగ్ లేఖలు ఇచ్చారు. మరో ఇద్దరిని వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించారు. పరిశీలనకు పిలిచిన వారిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు. వీరిని ఒక పోస్టుకు పరిమితం చేసి మిగిలిన పోస్టులకు మెరిట్‌లో వీరి తర్వాత వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవాల్సి ఉంది. ఈ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నారు. బుధవారం నుంచి ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. అందుకోసం రాష్ట్రంలో మొదటిసారిగా మూడు రకాల కొత్త రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో చేపడుతోంది.
మొదటిదశ
ఓపెన్ కాంపిటేషన్ (ఓసీ) పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రెండో దశ
వర్టికల్ రిజర్వేషన్లు, సామాజికపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మూడో దశ...
హారిజాంటల్ రిజర్వేషన్ (ప్రత్యేక) అమలు. ఈ కోటాలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీసు మెన్లు, ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆయా కోటాల్లో ఎంపిక చేస్తారు. మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీల్లో మూడో వంతు రిజర్వేషన్లు ఇస్తారు.
స్పోర్ట్ కోటాలో..
ఈ కోటాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు పోటీ పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీరికి 3శాతం పోస్టులు కేటాయించారు. గతంలో ఈ రిజర్వేషన్లకు పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారినే ఎంపిక చేసేవారు. ప్రస్తుతం వీరిని స్పోర్ట్స్ అఽథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఎంపిక చేస్తుంది. వీరు సూచించిన వారినే నేరుగా టీచర్లుగా నియమిస్తారు. జిల్లాలో 629 పోస్టుల్లో 19 మందిని ఈ కోటాలో నేరుగా ఎంపిక చేస్తారు.
ఎస్సీ రిజర్వేషన్లు ఇలా..
ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతం కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు గ్రూపులకు వర్తింపజేస్తారు. వీరిలో గ్రూపు-1లోని ఉపకులాలకు 1 శాతం, గ్రూపు-2లోని ఉపకులాలకు 6.5శాతం, గ్రూపు-3లోని ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. దీనికి సంబంధించి అభ్యర్థులు ఆయా గ్రూపులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
హారిజాంటల్ రిజర్వేషన్లు
ప్రభుత్వం జారీ చేసిన 77 జీవో ప్రకారం డీఎస్సీ ఎంపికలకు మొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్లకు అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ పాయింట్‌తో సంబంధం లేకుండా ఆ సైకిల్ కేటగిరీ అభ్యర్థి ఎక్కడ వచ్చినా రిజర్వేషన్ అమలు అయినట్లుగా పరిగణిస్తారు. డీఎస్సీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటించారు.