మార్కాపురం చెరువుకు మహర్దశ ఎప్పుడో..?
ABN , Publish Date - Dec 16 , 2025 | 10:57 PM
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మార్కాపురం చెరువు దశ మారడంలేదు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చెరువు అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టడంలేదు. 2014 నుంచి అధికారం చేపట్టిన మూడు ప్రభుత్వాలు చెరువును సమగ్రాభివృద్ధి చేసేందుకు ఆర్‌అండ్‌బీ శాఖతో ప్రతిపాదనలు పంపాయి. రెండుసార్లు నిధులు మంజూరైనా టెండర్ల ప్రక్రియలో నిలిచిపోయింది.
ప్రతిపాదిత నిధులు రాని వైనం
అమృత్ 2.0లో చేరిస్తేనే అభివృద్ధి సాధ్యం
పాలకులు దృష్టిసారిస్తేనే
మార్కాపురం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మార్కాపురం చెరువు దశ మారడంలేదు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చెరువు అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టడంలేదు. 2014 నుంచి అధికారం చేపట్టిన మూడు ప్రభుత్వాలు చెరువును సమగ్రాభివృద్ధి చేసేందుకు ఆర్‌అండ్‌బీ శాఖతో ప్రతిపాదనలు పంపాయి. రెండుసార్లు నిధులు మంజూరైనా టెండర్ల ప్రక్రియలో నిలిచిపోయింది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో నిధులు మంజూరైనా అవి అరకొరే. కేవలం కట్టపై రహదారిని అభివృద్ధి చేసేందుకే నిధులు కేటాయించారు. వాస్తవానికి ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖలు కాకుండా పురపాలకశాఖ దృష్టి సారించి ఉంటే చెరువు దశ, దిశ మారిపోయి ఉండేది.
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. ప్రధానంగా తాగునీటి అవసరాలకు ఉపయోగించే చెరువుల సంరక్షణ, సుందరంగా తీర్చిదిద్దడం, ఆహ్లాదంగా మార్చడంతోపాటు భూగర్భ జలాల నిల్వలు పెంపొందేలా పనులు చేపడుతున్నారు. నూతనంగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో కేంద్ర స్థానంలో కీలకమైన చెరువును అమృత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
పాలకులు దృష్టిసారిస్తేనే
ఒకప్పుడు మార్కాపురం పట్టణమంటే కరువుకు ప్రతిరూపం. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు. దశాబ్దం కిందట వరకు బిందెలతో మహిళలు నిత్యం పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఉండేది. దూపాడు నుంచి పైప్‌లైన్ ద్వారా సాగర్ నీరు లభ్యమవుతుండడంతో చాలా వరకు నీటి ఇబ్బందులు తప్పాయి. కరవు పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం వేసవిలో ఇప్పటికీ ఇబ్బందులు పడాల్సిందే. మార్కాపురం చెరువును తాగునీటి వనరుగా ఉపయోగించడంతోనే చాలా వరకు నీటి ఎద్దడిని నివారించేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుతం జిల్లా కేంద్రం కాబోతోంది. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు భూగర్భ జలాలు మరింత అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. పట్టణం ఎంతమేర విస్తరించినా చెరువులో నీరుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతటి ప్రాధాన్యత కల్గిన చెరువును త్వరితగతిన అభివృద్ధి చేయాల్సివుంది. మరీ ముఖ్యంగా రెండు వరుసలుగా రహదారిని చెరువు కట్టపై విస్తరించాల్సి ఉంది. కట్ట వెడల్పు మరింత విస్తరిస్తేనే ఇది సాధ్యం. కట్టకు రెండు వైపులా సుందరీకరణ పనులు చేస్తే పుర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించవచ్చు. ఆ దిశగా పాలకులు, అధికార యంత్రాంగం చొరవ చూపితే మార్కాపురం చెరువు దశ తిరిగినట్లే.
శతాబ్దాల చరిత్ర ఉన్న చెరువుకు నిధుల గ్రహణం
మార్కాపురం చెరువును 15వ శతాబ్దంలో నిర్మించారు. సుమారు 584 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని కింద అధికారిక ఆయకట్టు 1,100 ఎకరాలు కాగా అనధికారికంగా మరో 2వేల ఎకరాలు ఉంది. శతాబ్దాలపాటు మార్కాపురంతోపాటు చుట్టుపక్కల గ్రామాలైన బోడపాడు, నాయుడుపల్లి గ్రామాల భూములకు సాగునీటిని అందించింది. 2009 వరకు ఆయకట్టు కింద పొలాలు పండించే వాళ్లు. ఆ తర్వాత ఏటికేడు సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో చెరువును తాగునీటి వనరుగా మార్పు చేశారు. చెరువు పూర్తి స్థాయిలో నిండితే పట్టణంలోని సగం ప్రాంతంలో భూగర్భ జలాలకు ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి చెరువును, కట్టను అభివృద్ధి చేసేందుకు 2014 నుంచి ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు పలు పర్యాయాలు ప్రతిపాదనలు పంపారు. ఒక పర్యాయం ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. గత వైసీపీ పాలనలో ఎన్‌డీపీ పథకం కింద రూ.10కోట్ల నిధులు మంజూరై టెండర్ల పిలిచారు. కానీ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.12కోట్లతో ప్రతిపాదనలు పంపినా నిధుల లభ్యత లేకపోవడంతో స్థానిక 8వ వార్డులోని అలుగు నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని అలుగు వరకు 3కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మించేందుకు అడిషనల్ ప్లాన్ కింద రూ.4కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ జరగాల్సి ఉంది.