Share News

సమస్య ఏదైనా సరే.. ధైర్యంగా చెప్పండి

ABN , Publish Date - Jul 17 , 2025 | 10:53 PM

ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఒంగోలులో ‘ప్రజావాణి’ బాక్సులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ తెలిపారు.

సమస్య ఏదైనా సరే.. ధైర్యంగా చెప్పండి
ప్రజావాణి డబ్బాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జనార్దన్‌

ఎమ్మెల్యే దామచర్ల

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘ప్రజా వాణి’ బాక్సుల ఏర్పాటు

నగరంలో ప్రారంభించిన జనార్దన్‌

ఒంగోలు, కార్పొరేషన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఒంగోలులో ‘ప్రజావాణి’ బాక్సులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ తెలిపారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన కార్యక్రమాన్ని గురువారం నగర పరిధిలోని కొత్తపట్నం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును ఆయన ప్రారంభించి, మీడియాతో మాట్లాడారు. పరిపాలనాపరంగా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ప్రజలు తనను నేరుగా కలవలేని పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను తెలుసుకుని నేరుగా పరిష్కరించేందుకు వినూత్నంగా ఈ విధానం అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు. తొలుత వీటిని అద్దంకి బస్టాండ్‌, రంగారాయుడు చెరువు, కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేశామని, త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు తనను నేరుగా కవలేకపోయామనే నిరాశ వద్దన్నారు. సమస్య ఏదైనా కాగితంపై రాసి, పూర్తి వివరాలతో తెలియజేయాలని చెప్పారు. ప్రతి శుక్రవారం బాక్సులను ఓపెన్‌ చేసి, ఆ అర్జీలను పరిశీలించడంతోపాటు అర్జీదారుడుకు సెల్‌కు మెసేజ్‌ పంపడం, 48 గంటల్లో పరిష్కారం చేస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, ఆక్రమణలు, పట్టాలు, రేషన్‌ కార్డులు, ఇతరత్రా సమస్యలు తెలియజేయవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భూ కబ్జాల సమస్యలు కూడా తెలియజేయవచ్చని చెప్పారు. అర్జీదారుల పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని దామచర్ల తెలిపారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్‌, మాజీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, మైనార్టీ కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ కపిల్‌ బాషా, కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, అంబూరి శ్రీనివాసరావు, సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌, శాండిల్య, 12వ డివిజన్‌ అధ్యక్షులు గంగవరపు సందీప్‌, శశికాంత్‌ భూషణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 10:53 PM