ఏం కొంటాం.. ఏం తింటాం..
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:57 AM
కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ముట్టుకుంటేనే మండిపోతున్నాయి. టమాటా కిలో రూ.60కి చేరి ఠారెత్తిస్తోంది. పచ్చిమిర్చి కిలో రూ.80కి చేరి మంట పుట్టిస్తోంది. క్యారెట్ రూ.70 పలుకుతూ క్యారేట్ అనిపిస్తోంది.
దడపుట్టిస్తున్న కూరగాయల ధరలు
ఘాటెక్కిన పచ్చిమిర్చి
కిలో రూ.60కి చేరిన టమాటా
దొండ, దోస మినహా అన్నీ రూ.50పైనే
మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం
ఉత్పత్తి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ముట్టుకుంటేనే మండిపోతున్నాయి. టమాటా కిలో రూ.60కి చేరి ఠారెత్తిస్తోంది. పచ్చిమిర్చి కిలో రూ.80కి చేరి మంట పుట్టిస్తోంది. క్యారెట్ రూ.70 పలుకుతూ క్యారేట్ అనిపిస్తోంది. బీన్స్, పెద్దచిక్కుళ్లు సెంచరీ కొట్టాయి. దోస, దొండ మినహా మిగిలినవన్నీ కిలో రూ.50కిపైన పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు ఏం కొంటాం.. ఏం తింటాం అని నిట్టూరుస్తున్నారు.
స్థానికంగా తగ్గిన ఉత్పత్తి
జిల్లాలో సాధారణంగా ఈ సమయానికి కూరగాయల ఉత్పత్తి గణనీయంగా పెరగాల్సి ఉంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, నెలరోజులుగా వేసవిని తలపిస్తూ ఎండల తీవ్రత పెరగడంతో ఆ ప్రభావం కూరగాయల సాగుపై పడింది. ఉత్పత్తి భారీగా పడిపోయింది. వినియోగానికి అనుగుణంగా స్థానికంగా కూరగాయల సరఫరా జరగడం లేదు. జిల్లాలోని పలు ప్రాంతాలకు మార్టూరు, కొత్తపట్నం ప్రాంతాల నుంచి పలు రకాల కూరగాయలు వస్తాయి. ఈ సమయానికి పశ్చిమం నుంచి పచ్చిమిర్చి, టమాటా ఎక్కువగా సరఫరా అవుతాయి. ఆ ప్రాంతాల నుంచి పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో వ్యాపారులు ఇతర జిల్లాలు, కొన్నింటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. చెన్నై, పలమనేరు, మదనపల్లి వెళ్లి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నారు. అక్కడ డిమాండ్ ఉండటం, రవాణా చార్జీలు అధికమవుతుండటంతో అనివార్యంగా ధరలు పెంచాల్సి వస్తున్నదని వ్యాపారులు చెప్తున్నారు.
ఒక్కోరోజు ఒక్కో ధర
వేసవిలో పెరగాల్సిన కూరగాయల ధరలు ఇప్పుడు చుక్కల్లో చేరడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఏరోజు ఏరకం కూరగాయల ధర పెరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రజలు ప్రతిరోజూ వంటకు ప్రధానంగా వినియోగించే టమాటా, పచ్చి మిర్చి ధరలు భారీగా పెరిగాయి. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.40కి లభించిన టమాటా ధర ఇప్పుడు రూ.60కి చేరింది. హోల్‌సేల్‌లో ఈ ధర ఉండగా.. ఇళ్ల వద్దకు వచ్చి విక్రయించేవారు పావు కిలోకు రూ.20 నుంచి రూ.25 వసూలు చేస్తున్నారు. ఇక పచ్చిమిర్చి ధర కూడా కిలో రూ.80కి చేరింది. రిటైల్ వ్యాపారులు రూ.90 వరకూ వసూలు చేస్తున్నారు.