కొత్త రైళ్ల జాడేది?
ABN , Publish Date - May 18 , 2025 | 10:36 PM
గుంటూరు - గిద్దలూరు - గుంతకల్లు రైలు మార్గం మీటర్ గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌గా రూపాంతరం చెందింది. ఈ మార్గం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తయింది. సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ఇప్పటికే సగానికి పైగా దూరం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తయింది.
కనీసం పొడిగింపు బళ్లు కూడా లేవు
ప్రయాణికులకు ఇబ్బందులు
గిద్దలూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు - గిద్దలూరు - గుంతకల్లు రైలు మార్గం మీటర్ గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌గా రూపాంతరం చెందింది. ఈ మార్గం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తయింది. సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ఇప్పటికే సగానికి పైగా దూరం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తయింది. రైల్వేస్టేషన్లలో ఆధునికీకరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రయాణికుల అవసరానికి తగ్గట్లుగా కొత్త రైలు సర్వీసుల ఏర్పాటు మాత్రం జరుగడం లేదు. దాంతో పాత రైళ్ళలోనే సీట్లు దొరకక నిలబడేందుకు కూడా స్థలంలేని పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా బుట్టదాఖలు అవుతున్నాయి. చివరకు ఈ మార్గంలో ఉన్న పార్లమెంటు సభ్యులు సైతం కొత్త రైళ్ల ఏర్పాటు కోసం, ఉన్న రైళ్ల పొడిగింపు కోసం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కొత్త రైళ్లేవి?
నంద్యాల నుంచి విజయవాడ వరకు లేదా విశాఖపట్నం వరకు పగటిపూట సూపర్‌ఫాస్టు రైలును తిప్పాలని, ఈ రైలు వలన సాధారణ ప్రయాణికులకే కాకుండా వ్యాపారులకు, ఉద్యోగులకు, ఆసుపత్రులకు వెళ్లే రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏళ్లతరబడి ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులు గాలిలో కలిసిపోతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. అలాగే విజయవాడ నుంచి గిద్దలూరు, గుంతకల్లు మీదుగా ముంబయికి ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడపాలని చేస్తున్న విజ్ఞప్తులు ఎవరికీ పట్టడం లేదు.
పొడిగింపులు కూడా లేవు
కొత్త రైళ్లను ఎలాగూ ప్రవేశపెట్టడం లేదు, కనీసం తిరుగుతున్న రైళ్లను పొడిగించాలని చేస్తున్న విజ్ఞప్తులు కూడా రైల్వే అధికారుల చెవులకు చేరడం లేదు. నంద్యాల నుంచి కడప వరకు, నంద్యాల నుంచి కర్నూలు వరకు తిరుగుతున్న డెమో రైళ్లను గిద్దలూరు వరకు పొడిగించాలని ప్రయాణికులు విజ్ఞప్తులు చేస్తున్నారే తప్ప అధికారులు కనీసం ప్రతిపాదనలు కూడా పంపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. తెనాలి నుంచి మార్కాపురం వరకు తిరుగుతున్న రైలును గిద్దలూరుకు వరకు పొడిగించాలని అధికారులకు వినతిపత్రాలు అందచేశారు. రైళ్లు వచ్చి ఇక్కడి నుంచి రిటర్న్ పోయేందుకు వీలుగా తగినన్ని ఫ్లాట్‌ఫారాలు, ఇంజన్ షెడ్లు లాంటి సౌలభ్యాలు ఉన్నప్పటికీ ప్రయాణికుల విజ్ఞప్తులు పట్టించుకోక పోవడం శోచనీయం. గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా తిరుపతి వరకు తిరుగుతున్న రైలును చెన్నై వరకు పొడిగించాలని పార్లమెంట్ సభ్యులు, ప్రయాణికులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈప్రాంతవాసులు చెన్నై వెల్లాలంటే తిరుపతికి వెళ్లి మరో రైలు లేదా బస్సులో చెన్నై వెళ్లాల్సి ఉంది. లేదా ఒంగోలుకు బస్సులో వెళ్లి రైలులో వెళ్లాల్సి ఉంది. గుంటూరు-తిరుపతి రైలును చెన్నై వరకు పొడిగిస్తే వ్యాపారులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.
రోజూ తిప్పాలి
పూరి నుంచి బెంగళూరు వరకు వారానికి ఒక పర్యాయం తిరుగుతున్న రైలును డైలీ సర్వీ్‌సగా మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. గరీబ్‌రథ్ రైలును కూడా వీక్లీ కాకుండా వారానికి 3 రోజులు తిప్పాలని, గిద్దలూరులో స్టాపింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పునరుద్ధరణ చేయరా ?
కొత్త రైళ్ల సంగతి దేవుడెరుగు ఆపిన రైళ్లను పునరుద్ధరణ చేయకపోవడం రైల్వే అధికారులకే చెల్లింది. కరోనా సమయంలో అన్ని రైళ్లను ఆపి కరోనా అనంతరం ఒక్కొక్క రైలును పునరుద్ధరించిన అధికారులు ఇప్పటివరకు ఈ రూటులో తిరుగుతున్న బెంగళూరు ప్యాసింజర్ రైలును నేటికీ పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి గిద్దలూరు మీదుగా బెంగళూరుకు ప్రతిరోజు ప్యాసింజర్ రైలు నడిచేది. ఏళ్ల తరబడి నడిచిన ఈ రైలును కరోనా సమయంలో ఆపేశారు. అనంతరంం మిగతా రైళ్లను వేసినా, ఈ రైలును మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో పేద మధ్యతరగతి ప్రయాణికులకు ఇబ్బందిగా తయారైంది.
ప్యాసింజర్ రైళ్లు రద్దు
అసలే గామ్రీణ ప్రాంతం. ఈ రూటులో మాత్రం ఒక్క ప్యాసింజర్ రైలు కూడా తిరగకపోవడం బాధాకరం. గతంలో ఎక్కువ ప్యాసింజర్ రైళ్లు, తక్కువ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరిగేవి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి సేవలు అందేవి. కానీ కాలక్రమేణా కరోనా అనంతరం ఒక్కొక్క ప్యాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్పు చేశారు. ఈ రూటులో పగలు గాని, రాత్రి గాని ఒక్క ప్యాసింజర్ రైలు కూడా తిరగడం లేదు. అన్నీ ఎక్స్‌ప్రెస్ రైళ్లే నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లు తిరగకపోవడంతో కేఎ్‌సపల్లి, గుడిమెట్ట తదితర గామ్రీణ రైల్వేస్టేషన్లలో ఏ ఒక్క రైలు ఆగక చివరకు రైల్వేస్టేషన్‌లను సైతం మూసివేసే పరిస్థితి నెలకొన్నది. ప్రయాణికుల సమస్యలపట్ల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.