పశ్చిమ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:52 AM
ఈ విడత అసెంబ్లీ సమా వేశాలలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గళం విప్పారు. ప్రత్యేకించి పశ్చి మప్రాంత ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడారు. జిల్లాలో అధికార టీడీపీ నుంచి మంత్రి డాక్టర్ స్వామితోసహా ఆరుగురు, ప్రతిపక్ష వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి కీలక అంశాలు
సమస్యలతోపాటు వైసీపీ పాలనలో అక్రమాలపైనా చర్చ
ప్రభుత్వం తరఫున క్రియాశీలకంగా మంత్రి డాక్టర్ స్వామి
ముగిసిన శాసనసభ వర్షాకాల సమావేశాలు
హాజరుకాని వైసీపీ శాసనసభ్యులు
ఒంగోలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఈ విడత అసెంబ్లీ సమా వేశాలలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గళం విప్పారు. ప్రత్యేకించి పశ్చి మప్రాంత ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడారు. జిల్లాలో అధికార టీడీపీ నుంచి మంత్రి డాక్టర్ స్వామితోసహా ఆరుగురు, ప్రతిపక్ష వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈనెల 18 నుంచి శనివారం వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు జరిగాయి. వైసీపీ అధినేత వైఖరికి అనుగుణంగా ఆపార్టీకి చెందిన ఇరువురు ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగా ఉన్నారు. అధికారపార్టీకి చెందిన వారంతా సభకు హాజరు కాగా మంత్రి స్వామి ప్రభుత్వం తరఫున ఇటు అసెంబ్లీలోనూ, అటు శాసనమండలిలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీక రణ బిల్లును రెండు సభల్లోనూ ప్రవేశపెట్టడంతోపాటు సాంఘిక సంక్షే మశాఖకు సంబంధించి.. అందులోనూ వసతి గృహాల నిర్మాణాలు ఇతర అంశాలపై ప్రభుత్వ ప్రాధాన్యతను గట్టిగానే చెప్పారు. జిల్లాకు చెందిన ప్రత్యేకించి పశ్చిమప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డిలు అసెంబ్లీలో ఈసారి చురుగ్గా వ్యవహరించారు. కొన్ని అంశాలపై ముగ్గురూ కలిసి, అలాగే తమ నియోజకవర్గాలకు పరిమితమైన వాటిపై విడివిడిగానూ చర్చ పెట్టారు. తమ ప్రాంతంలోని ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల ఆవశ్యకతను సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల ద్వారా ఆయా అంశాలపై సమాధానాలు రాబట్టడంలో చొరవ చూపారు. కొన్ని అంశాలపై గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనా చర్చ పెట్టారు. సభ జరిగినన్ని రోజులు నిత్యం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు ఏదో ఒక అంశంపై మాట్లాడటం కనిపించింది. కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంతోపాటు ఇతర సమయంలోనూ అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ ప్రాంత అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
హామీలు పొందగలిగారు
పశ్చిమప్రాంతంలో ప్రభుత్వ వైద్యం దుస్థితి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది కొరత, పేదల ఇక్కట్లు, వైద్య సౌకర్యాల మెరుగు పర్చాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలు ముత్తుముల, కందుల, ఉగ్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎలుగెత్తి చాటారు. సంబంధిత మంత్రి సత్యకుమార్ నుంచి కొన్ని హామీలను కూడా పొందగలిగారు. ఆ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ప్రత్యేక చొరవ చూపి కనిగిరిలో మాతా శిశురక్షణ కోసం కంగారు మదర్స్ విభాగం ఏర్పాటును మంత్రి సత్యకుమార్ ప్రశంసించడం విశేషం. అసెంబ్లీ సమావేశాల చివరిరోజైన శనివారం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, లెవలింగ్ పేరుతో జరిగిన దోపిడీపై చర్చలో ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొని తమ ప్రాంతంలో ఆ సమయంలో జరిగిన అక్రమాలను, నాటి వైసీపీ పాలకుల అవినీతిని ఎండగట్టారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర తమ ప్రాంతంలో టిడ్కో ఇళ్ల కేటాయింపులు, ఇతర స్థానిక అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తమ ప్రాంతంలో అధికంగా ఉన్న మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, మిర్చి రైతుల కోసం ప్రత్యేకంగా మినీయార్డు ఏర్పాటు, మార్కాపురంలో నిలిచిపోయిన ముస్లిం షాదిఖానా నిర్మాణం, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
ఉమ్మడి సమస్యలపై అంతంతమాత్రమే
గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాల మెరుగుతో పాటు గిరిజన తాండాలలో ప్రసూతి కేంద్రాల ఏర్పాటు, భూసార పరీక్షా కేంద్రాల ఏర్పాటు, పట్టణంలోని రాచర్ల రోడ్డులో ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, టిడ్కో ఇళ్ల కేటాయింపు తదితర అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంతో పోల్చితే ఈసారి అసెంబ్లీలో జిల్లా ఎమ్మెల్యేలు కొంత చురుగ్గానే వ్యవహరించారు. అయితే జిల్లా ఉమ్మడి సమస్యలు, కీలక అభివృద్ధి అంశాలపై ఉమ్మడిగా అధికారపక్ష ప్రజాప్రతినిధులు సభ లోపల కానీ, వెలుపల వివిధ అవకాశాల ద్వారా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేసినట్లు కనిపించలేదు.