Share News

కుమార్తె కోసం వెళ్లి.. మృత్యువాత

ABN , Publish Date - May 24 , 2025 | 01:26 AM

కూతురి కాపురాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో వెళ్లిన తల్లితోపాటు కూతురు, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఇదే ప్రమాదంలో వారి బంధువులైన మరో ముగ్గురు కూడా దుర్మణం చెందారు. ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

కుమార్తె కోసం వెళ్లి.. మృత్యువాత
లారీ క్యాబిన్‌ కింద ఇరుక్కుపోయిన కారును బయటకు లాగుతున్న దృశ్యం

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

వారిలో తల్లీకూతురు, కుమారుడు

అందరూ బంధువులే

లారీని ఎదురుగా వెళ్లి ఢీకొట్టిన కారు

స్వగ్రామమైన స్టూవర్టుపురంలో విషాదం

హృదయవిదారకంగా తాటిచెర్లమోటు వద్ద ప్రమాద దృశ్యాలు

మృత్యుంజయులైన ఇద్దరు చిన్నారులు

గిద్దలూరు, మే 23 (ఆంధ్రజ్యోతి) : కూతురి కాపురాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో వెళ్లిన తల్లితోపాటు కూతురు, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఇదే ప్రమాదంలో వారి బంధువులైన మరో ముగ్గురు కూడా దుర్మణం చెందారు. ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన గజ్జల జనార్దన్‌ అలియాస్‌ చిన్నబోరయ్య, అంకాలు భార్యాభర్తలు. చాన్నాళ్ల క్రితమే జనార్దన్‌ మృతి చెందాడు. అంకాలు.. కుమారుడు నరసింహ, కూతురు భవానీకి వివాహాలు చేసింది. భవానీకి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల ఆమె మరో వ్యక్తితో కలిసి వెళ్లి నంద్యాల జిల్లా డోన్‌లో ఉంటోంది. ఈ క్రమంలో తల్లి అంకాలు, కుమారుడు నరసింహ, వీరి బంధువులు కలిసి గురువారం డోన్‌ వెళ్లారు. వారు భవానీతో మాట్లాడి ఒప్పించి తిరిగి స్వగ్రామమైన స్టూవర్టుపురానికి శుక్రవారం ఉదయం బయల్దేరారు. మార్గమధ్యంలో కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు (డ్రైవర్‌ సహా) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరిలో గజ్జల అంకాలు (40), ఆమె కూతురు గజ్జల భవానీ (25), కొడుకు గజ్జల నరసింహ (20), నరసింహ బావ అయిన బచ్చు సందీప్‌ అలియాస్‌ సన్నీ(25), నరసింహకు అన్నయ్య వరుసైన జోస్‌ఫరాజ్‌ అలియాస్‌ బబ్లు (25), బావమరిది వరుసైన కర్రెద్దుల దివాకర్‌ అలియాస్‌ చిన్ని (30) ఉన్నారు. దివాకర్‌ ఈ వాహనానికి డ్రైవర్‌గా ఉన్నాడు. భవానీ పిల్లలైన శీషా, సిద్ధులు గాయాలతో బయటపడ్డారు. వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె కోసం వెళ్లి వారి కుటుంబీకులతోపాటు తోటి బంధువులు మృత్యువాతపడటం అందరినీ కలచివేసింది.

ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ...

కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాలలో తీరని వ్యథను మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన గజ్జల నరసింహ కుటుంబాన్ని పరిశీలిస్తే.. చెల్లెలి కాపురాన్ని నిలబెట్టేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో అందరూ మృత్యువాతపడ్డారు. రెండేళ్ల క్రితం నరసింహకు వివాహమైంది. అతనికి భార్య, 6 నెలల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. గత వారమే కుమారునికి అన్నప్రాసన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాడు. ఈ ప్రమాదంలో నరసింహ మృతి చెందడంతో అభంశుభం తెలియని ఆ చిన్నారి బాలుడికి తండ్రి లేని లోటు మిగలగా నరసింహ భార్యను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.

ఒక్కడే కుమారుడు

రోడ్డుప్రమాదంలో స్టూవర్టుపురానికి చెందిన గజ్జల జోస్‌ఫరాజు అలియాస్‌ బబ్లు మృతిచెందాడు. ఎబొనైజర్‌ దంపతులకు జోస్‌ఫరాజు ఒక్కడే కుమారుడు. ఇంకా వివాహం కాలేదు. గ్రామంలో చిన్నపాటి ఫైనాన్స్‌ వ్యాపారం చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల బాధ అంతాఇంతా కాదు.

తల్లికి తీరని శోకం

ఈ ప్రమాదంలో మృతి చెందిన సందీప్‌ అలియాస్‌ సన్ని కుటుంబానిది మరింద దీనగాథ. తండ్రి చాలాకాలం క్రితం మృతి చెందగా తల్లి వ్యవసాయకూలీగా, ఇతరత్రా చిన్న పనులు చేసుకుంటూ తనకున్న ముగ్గురు పిల్లలను పెంచి పోషిస్తోంది. పెద్దకుమారుడైన సన్ని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.. సన్నికి పెళ్లి చేద్దామనుకుంటుండగా ఈసంఘటన జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేసింది.

Updated Date - May 24 , 2025 | 01:26 AM