Share News

శభాష్‌.. పోలీస్‌!

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:30 AM

కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని మార్కాపురం రూరల్‌ పోలీసులు శనివారం సకాలంలో వెళ్లి రక్షించారు. రూరల్‌ ఎస్‌ఐ అంకమరావు తెలిపిన వివరాల మేరకు.. మార్కాపురం పట్టణానికి చెందిన టి.సురేంద్ర అనే యువకుడు తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి మార్కాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వేట్రాక్‌ వైపు వెళ్లాడు.

శభాష్‌.. పోలీస్‌!
రైల్వే ట్రాక్‌ వద్ద ఉన్న యువకుడిని కాపాడి కౌన్సెలింగ్‌ ఇస్తున్న పోలీసులు

కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన మార్కాపురం యువకుడు

సకాలంలో వెళ్లి రక్షించిన పోలీసులు

కంభంలో మహిళను కాపాడిన వైనం

మార్కాపురం వన్‌టౌన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని మార్కాపురం రూరల్‌ పోలీసులు శనివారం సకాలంలో వెళ్లి రక్షించారు. రూరల్‌ ఎస్‌ఐ అంకమరావు తెలిపిన వివరాల మేరకు.. మార్కాపురం పట్టణానికి చెందిన టి.సురేంద్ర అనే యువకుడు తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి మార్కాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వేట్రాక్‌ వైపు వెళ్లాడు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు మార్కాపురం రూరల్‌ పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్‌ఐ అంకమరావు ఐటీ కోర్‌ టీమ్‌ సహాయంతో సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకుని అతని ప్రాణాలను కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఐ అంకమరావు, కానిస్టేబుళ్లు రంగనాయకులు, కాశీరావు, ఐటీ కోర్‌ సిబ్బందిని ఎస్పీ దామోదర్‌ అభినందించారు.

ఆత్మహత్యకు యత్నిస్తున్న మహిళను రక్షించిన పోలీసులు

కంభం : కంభం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నిస్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆమెను రక్షించారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. కంభం ఎస్సై నరసింహారావు కథనం మేరకు.. కంభం పట్టణం మేదరవీధికి చెందిన లాలమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలవైపు వెళ్లింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన పోలీసులు మహిళను గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Aug 24 , 2025 | 01:30 AM