Share News

గడప వద్దకే సంక్షేమం

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:22 AM

జిల్లావ్యాప్తంగా ఈనెల సామాజిక పింఛన్‌ల పంపిణీ సోమవారం ఉత్సాహంగా సాగింది. లబ్ధి దారుల ఇళ్ల వద్దకు సిబ్బంది వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేశారు. కొద్దిగంటల వ్యవధిలోనే లబ్ధిదారులలో అందుబాటులో ఉన్న వారందరికీ పంపిణీ చేశారు.

గడప వద్దకే సంక్షేమం
పింఛన్‌ సొమ్ము తీసుకుని ఆనందం వ్యక్తంచేస్తున్న మహిళలు

ఇంటింటికీ తిరిగి భరోసా పింఛన్లు పంపిణీ

మర్రిపూడి మండలంలో పాల్గొన్న మంత్రి డాక్టర్‌ స్వామి

పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు

గంటల వ్యవధిలో లబ్ధిదారులకు నగదు అందజేత

ఒంగోలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఈనెల సామాజిక పింఛన్‌ల పంపిణీ సోమవారం ఉత్సాహంగా సాగింది. లబ్ధి దారుల ఇళ్ల వద్దకు సిబ్బంది వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేశారు. కొద్దిగంటల వ్యవధిలోనే లబ్ధిదారులలో అందుబాటులో ఉన్న వారందరికీ పంపిణీ చేశారు. జిల్లాలో ఈనెల సామాజిక పింఛన్‌లు మొత్తం 2,84,625 మందికి రూ.124.53 కోట్లు విడుదల య్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభమైంది. పది గంటలకే 65 శాతం మందికి అందించారు. సాయంత్రం నాలుగు గంటలకు 2.38 లక్షల (87.51శాతం) మందికి సుమారు రూ.117.66 కోట్ల మేర నగదు అందజేశారు. మరికొంతమందికి సాయంత్రం అందుబాటులోకి రాగా వారికి కూడా ఇచ్చారు. వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలోని పలుప్రాంతాల్లో కీలక నేతలు పాల్గొన్నారు.

ఆప్యాయంగా పలుకరిస్తూ..

మంత్రి స్వామి తన నియోజకవర్గ పరిధిలోని మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో సోమవారం ఉదయాన్నే పింఛన్లు పంపిణీ చేశారు. అనేక మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలుకరించి యోగక్షేమాలను అడిగి పెన్షన్‌ మొత్తాలను అందించారు. ఒంగోలు నగరంలోని 33వ డివిజన్‌లో కొత్త డొంకలో పేదల నివాసాల వద్దకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వెళ్లి పంపిణీ చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ మంగమూరులో, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వెలిగండ్ల మండలం మొగళ్లూరులో, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలం మేకలవారిపల్లిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు వైపాలెం పట్టణంలోని ఎస్‌బీఐ బజారులో పింఛన్లు పంపిణీ చేశారు. దర్శి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పింఛన్లు పంపిణీ చేయగా జిల్లావ్యాప్తంగా గ్రామ, గ్రామాన ఉత్సాహంగా స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:22 AM