Share News

పృథులగిరి దేవాలయాల అభివృద్ధికి చొరవ తీసుకుంటాం

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:28 PM

రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో గురువారం ఆ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, రీజనల్‌ స్థపతి సురేంద్ర, ఒంగోలు సహాయ కమిషనర్‌ పానకాలరావులు మర్రిపూడిలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ దేవాలయాన్ని, పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు.

పృథులగిరి దేవాలయాల అభివృద్ధికి చొరవ తీసుకుంటాం
ముత్యాలమ్మ దేవాలయాన్ని పరిశీలిస్తున్న ఏసీ పానకాలరావు, రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పలు

మంత్రి ఆనం ఆదేశాలతో మర్రిపూడికి వచ్చిన దేవదాయశాఖ స్థపతి, సహాయ కమిషనర్‌

మర్రిపూడి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో గురువారం ఆ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, రీజనల్‌ స్థపతి సురేంద్ర, ఒంగోలు సహాయ కమిషనర్‌ పానకాలరావులు మర్రిపూడిలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ దేవాలయాన్ని, పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. గ్రామదేవతగా కొలువు తీరిన ముత్యాలమ్మ ఆనం వారి ఇంటి ఆడపడుచుగా గ్రామస్థులు ఆమెను పూజిస్తారు. ఆనం రామనారాయణరెడ్డి పూర్వీకులు మర్రిపూడి గ్రామానికి చెందిన వారు. ఇటీవల శిథిలమైన ముత్యాలమ్మ దేవాలయాన్ని దాతల సహకారంతో నూతనంగా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతోపాటు కల్యాణ మండపం నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందచేయాలని మంత్రి రామానారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు పృథులగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం రూ.3 కోట్ల 40లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ముందుకు కదల్లేదు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్థానిక మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పృథులగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికితోడు దేవదాయశాఖా మంత్రి స్వగ్రామం మర్రిపూడి కావడంతో మరోమారు ఆ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు, స్థపతి సంయుక్తంగా దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయం ప్రాంగణం విస్తరణతోపాటు దేవాలయ పునర్నిర్మాణం కోసం అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు అధికారులను కలిసి ముత్యాలమ్మ దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరివెంట డీఈ శ్రీనివాసరావు, ఏఈ యుగంధర్‌, కందుకూరు, ఒంగోలు ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, వేణు, ఈవోలు నారాయణ రెడ్డి, లీలా కృష్ణ, గ్రామ పెద్దలు ఆనం సత్యనారాయణరెడ్డి, బీవీ భాస్కర్‌ రెడ్డి, మాధిరెడ్డి, బసిరెడ్డి, వీరనారాయణ, నరసింహారావు, బీఎల్‌ఎన్‌ శాస్త్రీ, పుల్లారెడ్డి ఉన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:28 PM