Share News

వెలిగొండ ద్వారా నీరు తెప్పిస్తాం

ABN , Publish Date - Aug 04 , 2025 | 10:41 PM

జగన్‌లాగా ప్రజల చెవిలో పూలు పెట్టబోమని, వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజలకు నీటిని అందిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు. గిద్దలూరు మార్కెట్‌ యార్డు ఆవరణలో గిద్దలూరు, కంభం మార్కెట్‌ కమిటీ చైర్మన్ల, వైస్‌చైర్మన్ల, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వేలాది మంది కార్యకర్తల, నాయకుల, రైతుల మధ్య జరిగింది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ పూర్తి చేశాం, జాతికి అంకితం చేశాం అని చెప్పుకునే జగన్‌ నీళ్లు ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. జగన్‌ లాగా మోసం చేయబోమన్నారు.

వెలిగొండ ద్వారా నీరు తెప్పిస్తాం
ప్రసంగిస్తున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండానే జాతికి అంకితమంటూ వైసీపీ శిలాఫలకం

జగన్‌లా ప్రజల చెవిలో పూలు పెట్టం

సాగు, తాగునీటి సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

వైసీపీ అంటించిన కులగజ్జిని వదలండి

మార్కాపురం ఎమ్మెల్యే కందుల

గిద్దలూరు చర్రితలో తొలిసారి బీసీకి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి : బాలయ్య

గిద్దలూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : జగన్‌లాగా ప్రజల చెవిలో పూలు పెట్టబోమని, వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజలకు నీటిని అందిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు. గిద్దలూరు మార్కెట్‌ యార్డు ఆవరణలో గిద్దలూరు, కంభం మార్కెట్‌ కమిటీ చైర్మన్ల, వైస్‌చైర్మన్ల, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వేలాది మంది కార్యకర్తల, నాయకుల, రైతుల మధ్య జరిగింది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ పూర్తి చేశాం, జాతికి అంకితం చేశాం అని చెప్పుకునే జగన్‌ నీళ్లు ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. జగన్‌ లాగా మోసం చేయబోమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం పశ్చిమ ప్రకాశానికి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజాప్రభుత్వ హయాంలో త్వరలోనే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా రాబోతుందన్నారు. ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారో ప్రజలు గుర్తించాలని కోరారు. వైసీపీ ప్రజలకు కులపిచ్చి పూసిందని, మీకు కులపిచ్చి ఎందుకని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు జాబ్‌క్యాలెండర్‌ ఇస్తామని చెప్పిన జగన్‌ వారిని పట్టించుకోకుండా గంజాయికి బానిసలు చేశాడని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో అన్నదాతకు రూ.13 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తుండగా ప్రజా ప్రభుత్వం రూ.20వేలు ఇస్తుందని, మొదటి విడతగా రూ.7వేలు ఇచ్చిందని తెలిపారు.

వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలి : ఉగ్ర

కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియచెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని అభినందించారు. తాగు, సాగునీరు వస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదన్న ఉద్దేశంతో వెలిగొండను పూర్తి చేసేందుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మాట్లాడుతూ కనిగిరికి రైల్వేలైన్‌ వచ్చినట్లుగానే గిద్దలూరుకు మరో 4 లైన్ల రోడ్డు రాబోతుందన్నారు. టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఒక్కసారి అంటూ ముఖ్యమంత్రిగా వచ్చి జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు రపారపా అంటూ ఎమ్మెల్యేలను, ఎంపీలను చంపండంటూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.


దళితులకు ఆలయం, సహపంక్తి భోజనం బాబు వల్లే : ఎరిక్షన్‌

యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ హోటల్స్‌లో రెండు గ్లాసుల విధానాన్ని తీసివేయించి, దళితులకు ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనం చేపట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. గిద్దలూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బైలడుగు బాలయ్య మాట్లాడుతూ నియోజకవర్గం పుట్టిన తరువాత తొలిసారి చైర్మన్‌ పదవిని బీసీకి ఇచ్చిన ఘనత అశోక్‌రెడ్డికి దక్కుతుందని అన్నారు. కంభం మార్కెట్‌కమిటీ చైర్మన్‌ పూనూరు భూపాల్‌రెడ్డి, జనసేన ఇన్‌చార్జి సాయిబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.వి.నారాయణ పాల్గొన్నారు.

రోడ్డంతా పచ్చదనమే

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోటెత్తారు. గిద్దలూరులోని ప్రధాన వీధులన్ని పసుపుపచ్చమయమైంది. మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సభాస్థలి మొత్తం నిండిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకుని మోటార్‌ సైకిల్‌ ర్యాలీతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మార్కెట్‌యార్డుకు రాగా రాచర్ల గేటు నుండి మార్కెట్‌యార్డు వరకు ఇరువైపులా స్వాగత బ్యానర్లు, రోడ్డు మీద టీడీపీ శ్రేణులతో నిండిపోయింది. మార్కెట్‌యార్డు వద్ద ప్రత్యేక క్రేన్‌ సహాయంతో మంత్రులకు గజమాలలు వేసి స్వాగతం పలికారు. అతిథులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి జ్ఞాపికలు అందచేసి ఘనంగా సన్మానించారు.

Updated Date - Aug 04 , 2025 | 10:41 PM