ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటాం
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:42 PM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు.
యంత్రాంగం సర్వం సిద్ధం
కలెక్టరేట్‌లో 08592-281400 నెంబరుతో కంట్రోలు రూము
అత్యవసరం కోసం 1077 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు
వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచన
కలెక్టర్ రాజాబాబు వెల్లడి
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని దిత్వా తుఫాన్ కంట్రోలు రూములో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తీర ప్రాంతంతోపాటు సమీపంలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అందుకోసం ప్రత్యేక అధికారులను ఆయా మండలాలను నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశించినట్లు చెప్పారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఒంగోలు నగరంలోని పోతురాజుకాలువ, నల్లకాలువ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగానికి సహకరించేలా 30 మందితో కూడిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందం కూడా అందుబాటులో ఉందన్నారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్య్సకారులను కోరారు. తుఫాన్ ప్రభావం ఉన్నందున ఐదు రోజుల పాటు వరి కోతలను రైతులు వాయిదా వేసుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకోసం ఆయాశాఖల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08592-281400 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసరం కోసం కలెక్టరేట్‌లో 1077తో టోల్‌ఫ్రీ నెంబరును కూడా ఏర్పాటు చేశామని ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపుతామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో చిన్నఓబులేశు, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ కమాండర్ దిల్బాగ్ సింగ్ పాల్గొన్నారు.