పేదరికం లేని సమాజ స్థాపనకు తోడ్పడాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:55 PM
రాష్ట్రంలో 2029 నాటికి పేదరికం లేని సమాజం నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తమీమ్‌అన్సారియా చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ 4 కార్యక్రమానికి సంబంధించి గిద్దలూరులో మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
గిద్దలూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2029 నాటికి పేదరికం లేని సమాజం నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తమీమ్‌అన్సారియా చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ 4 కార్యక్రమానికి సంబంధించి గిద్దలూరులో మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా, బలంగా ఉన్నవారు, అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకు సహాయం అందిస్తే అసమానతలు తొలగిపోయి సమానత్వం నెలకొంటుందన్నారు. జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను గుర్తించామని, 34వేల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని చెప్పారు. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని, ఎవరూ ఎవరిని బలవంతంగా ఇందులో చేర్చడం లేదని తెలిపారు. దత్తత తీసుకునే విషయంలో నిర్భంధం చేస్తే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి తనకు తెలిసిన వారికి చెప్పి మార్గదర్శిగా మారేందుకు చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సెయింట్ సాఫ్ట్‌వేర్ అనే ప్రఖ్యాత సంస్థ చైర్మన్ అయిన బి.వి.మోహన్‌రెడ్డి తనకు సమీప బంధువని, బేస్తవారపేట మండలంలోని అన్ని గ్రామాలలో గల బంగారు కుటుంబాలను మోహన్‌రెడ్డి దత్తత తీసుకునేందుకు అంగీకారం తెలిపారని పేర్కొంటూ సమావేశంలో ఆయనను అశోక్‌రెడ్డి అభినందించారు. నియోజకవర్గంలో 10879 బంగారు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పటికే 5868 కుటుంబాలకు మార్గదర్శులను చూశామని చెప్పారు. ఈకార్యక్రమంలో సబ్‌కలెక్టర్ త్రివినాథ్, జిల్లాపరిషత్ సీఈవో చిరంజీవి, డ్వామా పీడీ జోస్‌ఫకుమార్, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సీతారామిరెడ్డి, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, సొసైటీ అధ్యక్షులు దుత్తా బాలీశ్వరయ్య పాల్గొన్నారు.
మెనూను పకడ్బందీగా అమలు చేయాలి
కంభం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కంభం బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతోపాటు తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కందులాపురంలో ఏర్పాటు చేసిన నీటికుంటలను కలెక్టర్ పరిశీలించిన అనంతరం మార్గమధ్యలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ 9, 10, ఇంటర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. 600 మందికి పైగా ఉన్నా టాయిలెట్ సౌకర్యంతోపాటు రాత్రివేళ తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు కలెక్టర్‌కు విద్యార్థినులు తెలిపారు. దీనితో స్పందించిన కలెక్టర్ ఆర్‌వో ప్లాంటును అనంతరం విద్యార్థినుల టాయిలెట్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ చాముండేశ్వరి పాల్గొన్నారు.