Share News

సమస్యలు అనేకం.. కావాలి ఉపశమనం!

ABN , Publish Date - May 12 , 2025 | 01:46 AM

జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతు న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. అవసరమైన మేర నీటి సరఫరా జరక్కపోవడంతో ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. రూ.21 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండటంతో అధికారులు సమస్య ఉన్నా నీటి సరఫరా వైపు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సమస్యలు అనేకం.. కావాలి ఉపశమనం!

పశ్చిమంలో దాహం కేకలు

రూ.21కోట్ల బిల్లులు పెండింగ్‌

ఉపాధి పనుల్లో సాగని పంట కుంటల తవ్వకాలు

రూ.131 కోట్ల మెటీరియల్‌ కోటా పనులకు నిలిచిన చెల్లింపులు

హౌసింగ్‌, సూర్యఘర్‌ అమలు అంతంతమాత్రం

పీజీఆర్‌ఎస్‌ పరిష్కారంపై ప్రజల్లో అసంతృప్తి

నేడు డీఆర్సీ సమావేశం

ఒంగోలు, మే 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతు న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. అవసరమైన మేర నీటి సరఫరా జరక్కపోవడంతో ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. రూ.21 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండటంతో అధికారులు సమస్య ఉన్నా నీటి సరఫరా వైపు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా వినతుల పరిష్కారం (పీజీఆర్‌ఎస్‌) విషయంలో యంత్రాంగం తీరుపై జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీటితోపాటు ఇతరత్రా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశం ఆరు నెలల తర్వాత సోమవారం జరగనుంది. స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్‌ హాలులో ఉదయం 11గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. అజెండాను పరిమితంగానే పెట్టారు. జిల్లాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వ ప్రాధాన్యతను క్రోడీకరించి ఐదు కీలక అంశాలను ఉంచారు. అందులో ఉపాధి హామీ పథకం, వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. హౌసింగ్‌, విద్యుత్‌శాఖ పరిధిలోని పీఎం సూర్యఘర్‌ పథకాలతోపాటు ప్రజావినతులు పరిష్కారం (పీజీఆర్‌ఎస్‌) అంశాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు వాటికే పరిమితం కాకుండా మిగిలిన ప్రధాన సమస్యలపైనా చర్చించి ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది.

తాగునీటి కోసం తల్లడిల్లుతున్న ప్రజలు

జిల్లాలో పల్లె, పట్టణం తేడా లేకుండా తాగునీటి కోసం ప్రజానీకం తల్లడిల్లిపో తోంది. పశ్చిమప్రాంత గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పశ్చిమాన 10 మండలాల్లోని 73 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నిజానికి అంతకు రెట్టింపు గ్రామాల్లో సమస్య ఉంది. గతంలో నీటి సరఫరా చేసిన దానికి సంబంధించి రూ.21 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అధికారులు సమస్య ఉన్నా నీటి సరఫరా వైపు దృష్టి పెట్టడం లేదని సమాచారం.

డ్వామాలో అవినీతిపరులపై చర్యలు కరువు

జిల్లాలో ఆయా పథకాల పురోగతి, ప్రజా సమస్యలను పరిశీలిస్తే.. ఉపాధి పథకం పనులు మమ్మరంంగా జరుగుతు న్నాయి. అయితే పథకంలో అత్యంత ప్రధానమైనదిగా ఉన్న పంట కుంటల తవ్వకాలు ముందుకు సాగడం లేదు. దాదాపు తొమ్మిదన్నర వేల కుంటల తవ్వకం లక్ష్యంకాగా ఇప్పటి వరకు కనీసం ఒక్క శాతం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. నిబంధనలకు అనుగుణంగా కుంటల తవ్వకం కష్టతరంగా ఉండటంతో కూలీలు ఆ పనులకు పెద్దగా రావడం లేదు. దీంతో రైతులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఇంకుడు గుంతలు, చెరువుల అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వ కాలంలో డ్వామాలో జరిగిన అవినీతిని త్రిసభ్య కమిటీ నిగ్గు తేల్చడంతో పూర్వపు పీడీ శీనారెడ్డిపై కఠిన చర్యలకు కలెక్టర్‌ సిఫార్సు చేసి మూడు నెలలవుతున్నా ప్రభుత్వం నుంచి చర్యలు కరువయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కూడా అధికారులు తూతూమంత్ర చర్యలతో సరిపుచ్చారు. దీంతో ఉపాధి పథకం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో మెటీరియల్‌ కోటా కింద చేసిన పనులకు సంబంధించి బిల్లులు దాదాపు రూ.131 కోట్ల మేర పెండింగ్‌ ఉండటంతో ఆ పనులు చేసిన వారు గగ్గోలు పెడుతున్నారు.


ముందుకు సాగని గృహ నిర్మాణాలు

గృహ నిర్మాణ విషయాన్ని పరిశీలిస్తే వచ్చే నెల 12న సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో సుమారు 21వేల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్ణయించారు. అందులో వచ్చేనెల 12వతేదీన 8వేల గృహప్రవేశాలు లక్ష్యంగా నిర్ణయించగా సగం కూడా పూర్తి కాలేదు. విద్యుత్‌ రంగంలో సోలార్‌ విద్యుత్‌ వాడకం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్‌ పథకం జిల్లాలో ముందుకు సాగడం లేదు. ఒక్కో నియోజకవర్గానికి 10వేల వంతున 80వేల కనెక్షన్లు లక్ష్యంగా నిర్దేశించడంతోపాటు భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. అయినా కనీసం ఒక్క శాతం కూడా పురోగతి కనిపించడం లేదు. అజెండాకు సంబంధించి మరో కీలకమైన పీజీఆర్‌ఎస్‌ తీరు చూస్తే అర్జీల పరిష్కారం సంగతి ఎలా ఉన్నా ప్రజల్లో ఈవిషయంలో యంత్రాంగం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అజెండాకు సంబంధించిన అంశాలే కాకుండా జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు, యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణాలు, సాగర్‌ కాలువలు, ఇతర సాగునీటి వనరుల మరమ్మతు పనులతోపాటు ప్రభుత్వ పథకాల పురోగతిపై డీఆర్సీ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది.

Updated Date - May 12 , 2025 | 01:46 AM