సమరశీల పోరాటాలు సాగించాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:44 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అంగన్‌వాడీలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు పిలుపునిచ్చారు.
ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
‘అంగన్‌వాడీ’ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు పిలుపు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అంగన్‌వాడీలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక కొత్తకూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబిరాణి అధ్యక్షతన జరిగిన సభలో సింధు మాట్లాడుతూ తనకు తాను విశ్వగురుగా ప్రకటించుకున్న మోదీ.. దేశం వికసిత్ భారత్‌గా వెలిగిపోతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం స్వర్ణాంధ్రగా వికసిస్తుందని చెప్పుకుంటుండగా.. అదేస్థాయిలో పేదలు చాలామంది పోషకాహారం అందక రక్తహీనతకు గురవుతున్నారన్నారు. ప్రతిరోజూ పోష్టికాహరం లోపంతో మరణిస్తున్న 70వేల పసికందులపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పేదలకు పోషకాహారం అందిస్తూ సామాజిక బాద్యతగా సేవ చేస్తున్న అంగన్‌వాడీలకు కనీస వేతనంతో పాటు తగిన గౌరవం దక్కాలంటే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాల అమలులో ఒక్కొక్క రాష్ట్రం ఒక తీరుగా చెల్లిస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో కార్యకర్తలకు రూ. 24800, హెల్పర్లకు రూ.20వేలు కోర్టు ద్వారా సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం అక్టోబరు నెలలో కేంద్రమంత్రుల నివాసాల వద్ద పది రోజుల పాటు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్మావంటి నిర్భంధాలు ఎదిరించి ఎన్నో విజయాలు సాధించిన ఉద్యమ స్ఫూర్తితో అంగన్‌వాడీలు, స్కీమ్‌వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్ నరసింగరావు, ఉమామహేశ్వరరావు, కారుసాల సుబ్బరావమ్మ, జీవీ కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, పీ రోజా, ఎం. రమేష్, సత్యవతి, జి. శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నెల్లూరు బస్టాండు నుంచి కొత్తమార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.