చిన్నారుల బంగారు భవితకు బాటలు వేయాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:18 PM
డీఎస్పీలో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులు చిన్నారుల బంగా రు భవితకు బాటలు వేసేందుకు శక్తివంచనలేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం 2025 డీఎస్పీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ఆత్మీయ సమావేశం జరిగింది.
మార్కాపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): డీఎస్పీలో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులు చిన్నారుల బంగా రు భవితకు బాటలు వేసేందుకు శక్తివంచనలేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం 2025 డీఎస్పీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషికీ జీవితంలో మూడు దశలు ఉంటాయన్నారు. వాటిల్లో అత్యంత కీలకమైనది విద్యార్థి దశ అన్నారు. ఈ దశలో చిన్నారులను దగ్గరుండి విద్యపై మక్కువ పెరిగేలా చేస్తే వారి బావి జీవితం ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఈ దశలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. చిన్నారులకు అత్యుత్తమ బోధన అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు ఇష్టపడి పాఠాలు బోధించాలన్నారు. విద్యాపరంగా పశ్చిమ ప్రకాశం ఎంతో వెనుకబడి ఉందన్నారు. త్వరలో నూతన జిల్లాగా ఏర్పడబోయే మార్కాపురంను విద్యతోనే అభివృద్ధి చెందేలా చేయడం మనందరి బాధ్యత అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి ఉపాధ్యాయుల చేతిలో ఉందనే విషయాన్ని మరువవద్దన్నారు. గత పాలకుల వైఫల్యాల కారణంగా మన ప్రాం తం ఎంతో వెనుకబడి పోయిందన్నారు. నేడు ప్రజాప్రభుత్వం మార్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తీవ్రం గా కృషి చేస్తోందన్నారు. ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం జిల్లా, పరిశ్రమలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటు తదితరాలతో పశ్చిమం అభివృద్ధి అడుగులు వేస్తోందన్నారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో మామిళ్లపల్లి శ్రీనివాసులు, ఎంఈవో-2 శర్వాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎమ్‌సీ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, సొసైటీ ఛైర్మన్ జవ్వాజి రామాంజులరెడ్డి, టీడీపీ పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంఖాన్, కాకర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.