Share News

రెవెన్యూ సమస్యలపై బాధ్యతాయుతంగా పనిచేయాలి

ABN , Publish Date - May 06 , 2025 | 11:30 PM

రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తిబాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు.

రెవెన్యూ సమస్యలపై బాధ్యతాయుతంగా పనిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

కలెక్టర్‌ అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తిబాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో రెవెన్యూ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వస్తున్నాయన్నారు. వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యను అర్థంచేసుకొని నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, పీజీఆర్‌ఎ్‌సలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలపై క్షేత్ర స్థాయి ఆడిట్‌ను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో ఎండార్స్‌మెంట్‌ ఇచ్చినా వాటిని పరిష్కారం చూపిన విధానం సక్రమంగా ఉందా, లేదా అనిది రెవెన్యూ డివిజనల్‌అధికారులు పరిశీలించాలన్నారు. ప్రధానంగా రీ ఓపెన్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వాటిపై గ్రామాలవారీగా నివేదిక అందజేయాలని కలెక్టర్‌ చెప్పారు. వివిధశాఖల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ కేటాయింపులపై వచ్చిన అర్జీలను సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేషు, ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు లక్ష్మీప్రసన్న, కేశవర్దనరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:30 PM