Share News

నష్టాన్ని గుర్తించాం.. ప్రభుత్వానికి నివేదిస్తాం..

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:47 AM

‘మొంథా తుఫాన్‌తో వాటిల్లిన నష్టాన్ని గుర్తించాం. ప్రభుత్వానికి క్షేత్రస్థా యిలోని పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇస్తాం’ అని కేంద్ర బృందం సభ్యులు భరోసా ఇచ్చారు. తుఫాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి.పౌసు మిబసు, మహేష్‌కుమార్‌, శశాంక్‌ శేఖర్‌రాయ్‌, సాయిభగీరథ్‌లతో కూడిన బృందం సోమవారం జిల్లాకు వచ్చింది.

నష్టాన్ని గుర్తించాం.. ప్రభుత్వానికి నివేదిస్తాం..
నాగులుప్పలపాడు వద్ద దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

కేంద్ర బృందం భరోసా

మొంథా తుఫాన్‌ నష్టాల పరిశీలన

బృందాన్ని కలిసి పరిస్థితిని వివరించిన ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 10(ఆంధ్ర జ్యోతి): ‘మొంథా తుఫాన్‌తో వాటిల్లిన నష్టాన్ని గుర్తించాం. ప్రభుత్వానికి క్షేత్రస్థా యిలోని పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇస్తాం’ అని కేంద్ర బృందం సభ్యులు భరోసా ఇచ్చారు. తుఫాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి.పౌసు మిబసు, మహేష్‌కుమార్‌, శశాంక్‌ శేఖర్‌రాయ్‌, సాయిభగీరథ్‌లతో కూడిన బృందం సోమవారం జిల్లాకు వచ్చింది. వారితోపాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ ఉన్నారు. ముందుగా వరద నష్టాలపై జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను బృంద సభ్యులు తిలకించారు. అనంతరం వరద నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నష్టాలపై కలెక్టర్‌ రాజాబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, పశుసంవర్థక తదితర శాఖలతోపాటు ఒంగోలు నగరంపైనా తీవ్రప్రభావం చూపిందని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. తుఫాన్‌ తర్వాత సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీసుకున్న చర్యలను తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను బృందం వీక్షించింది. జిల్లాలోని పశ్చిమప్రాంతంలో అధికంగా నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ రాజాబాబు వివరించారు. పత్తి 8,313 హెక్టార్లు, వరి 1,557, సజ్జ 1,388, మొక్కజొన్న 1,260 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు 12,570 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు కలెక్టర్‌ బృంద సభ్యులకు వివరించారు.

అన్నివిధాలా ఆదుకోవాలి

తుఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లినందున అన్నివిధాలుగా ఆదుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌ కోరారు. బృంద సభ్యులను కలిసి ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో అందజేశారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ కూడా బృంద సభ్యులను కలిసి వరద నష్టాలను వివరించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రైతులను, వివిధ వర్గాల ప్రజలను అన్నివిధాలుగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన

కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అనంతరం కేంద్రబృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని కొప్పోలు, కొత్తపట్నం మండలం అల్లూరులో నష్టాలను పరిశీలించారు. వరి పొలాలను పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. అదేవిధంగా ఎన్‌జీపాడులో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. కేంద్ర బృందం వెంట కలెక్టర్‌ రాజాబాబు, జేసీ రాజాబాబుతో పాటు ఆయాశాఖల అదికారులు ఉన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:47 AM