20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:25 AM
20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం..అన్ని వసతులు కల్పించారు.. ఇపుడు ఖాళీచేయండంటూ చెప్పడం అన్యాయమని స్థానిక త్రిపుల్ ఐటీ కళాశాల పక్కన ఉన్న సర్వేనెంబరు 392/17 లోని అంబేడ్కర్ కాలనీవాసులు వాపోతున్నారు.
సంతనూతలపాడు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం..అన్ని వసతులు కల్పించారు.. ఇపుడు ఖాళీచేయండంటూ చెప్పడం అన్యాయమని స్థానిక త్రిపుల్ ఐటీ కళాశాల పక్కన ఉన్న సర్వేనెంబరు 392/17 లోని అంబేడ్కర్ కాలనీవాసులు వాపోతున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మంగళవారం సాయంత్రం తహసీల్దార్ నారాయణరెడ్డి రెవెన్యూసిబ్బందితో అంబేడ్కర్ కాలనీ వద్దకు వెళ్లారు. కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మీరుంటున్న ఇంటి స్థలానికి సంబంధించి మీవద్ద ఎటువంటి ఆధారం లేకుంటే ఖాళీ చేయాలని అనడంతో కొంతసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అంబేడ్కర్ కాలనీ వాసులు మేము కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, అర్థంతరంగా ఇలా ఇబ్బంది పెట్టడం సబబుకాదని రెవిన్యూవారికి తెలిపారు. తమ కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పించి ఇప్పుడు ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. దీంతో తహసీల్దార్ నారాయణరెడ్డి మాట్లాడుతూ కోర్టు నిబంధనల మేరకు మేము పనిచేయాలని, అదేవిధంగా మీరుంటున్న ఇళ్లస్థలాలకు సంబంధించి ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలని కాలనీవాసులను అడిగారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు ఉన్నవాళ్లవరకు రెవిన్యూసిబ్బంది సేకరించారు. మీకు అవసరమైతే వేరొకచోట స్థలాలు వచ్చేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. సేకరించిన సమాచారాన్ని పైఅధికారులకు తెలియజేస్తామని తహసీల్దార్ నారాయణరెడ్డి తెలిపారు. కాగా ఈసమస్యపై కాలనీవాసులు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో అర్జీలు అందజేసినట్లు తెలిపారు. ఒంగోలు ఆర్‌డీవో అంబేడ్కర్ కాలనీ వాసుల సమస్య పరిష్కార విషయమై మంగళవారం ఒంగోలు ఆర్‌డీవో కార్యాలయానికి రమ్మని చెప్పిట్లు కాలనీ వాసులు తెలిపారు.