పాచిపట్టి.. శిథిలావస్థకు చేరి...!
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:54 PM
మర్రిపూడిలో పది రోజులుగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు దాహార్తిని తీర్చుకునేందుకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న స్టోరేజ్ ట్యాంక్ వద్దకు బిందెలు తీసుకొని పరుగులు పెడుతున్నారు. మరికొంతమంది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొట్టిరెడ్డిపాలెం బీఎల్‌ఎ్‌సఆర్ ట్యాంక్ వద్దకు వెళ్లి బిందెలతో తోడుకొని వస్తున్నారు.
మర్రిపూడిలో రక్షిత నీటి ట్యాంక్ దుస్థితి ఇది
గ్రామస్థుల దాహం కేకలు
పది రోజులుగా నిలిచిన నీటి సరఫరా
పట్టించుకోని అధికారులు
ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
మర్రిపూడి, అక్టోబర్ 13 (ఆంధ్రజ్యోతి) : మర్రిపూడిలో పది రోజులుగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు దాహార్తిని తీర్చుకునేందుకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న స్టోరేజ్ ట్యాంక్ వద్దకు బిందెలు తీసుకొని పరుగులు పెడుతున్నారు. మరికొంతమంది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొట్టిరెడ్డిపాలెం బీఎల్‌ఎ్‌సఆర్ ట్యాంక్ వద్దకు వెళ్లి బిందెలతో తోడుకొని వస్తున్నారు. రెండు వేల కుటుంబాలకుపైగా ఉన్న గ్రామంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఆయా నీటి వనరులను వాడుకొంటున్నారు. మిగిలిన అందరు శుద్ధ జలాలను కొనుక్కొని తాగాల్సి వస్తోంది. దీనికితోడు ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసన సభ్యులు ప్రస్తుత రాష్ట్రమంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి పూర్తిగా శిఽథిలావస్థకు చేరిన ట్యాంక్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో తాత్కలికంగా ట్యాంక్ మరమ్మతులు చేయడంతో ఇప్పటి వరకు ఇబ్బది లేకుండా ఉంది. అయితే ట్యాంక్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన ఊడిపోవడంతో ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రం చేసే నాధుడే కరువయ్యరు. ట్యాంక్‌పైకప్పు మూతలేక పోవడంతో పావురాలు, కాకుల కళేబరాలు ట్యాంక్‌లోపల పడి చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు పక్షుల ఈకలు కుళాయిల ద్వారా బయటకు వస్తున్నాయి. ట్యాంక్ శుభ్రం చేయకపోవడంతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ట్యాంక్‌ను శుభ్రం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు మూడు రోజుల క్రితం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులను ముక్తకంఠంతో వేడుకున్నారు. నిచ్చెన ఏర్పాటు చేయనిదే ట్యాంక్ శుభ్రం చేసే వీలు పడదని ఆర్‌డబ్ల్యూయస్ ఏఈ జైపాల్ తేల్చి చెప్పారు. నిచ్చెన ఏర్పాటు కోసం రూ.3 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపామన్నారు. దీంతోపాటు 60 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన మరో రెండు ట్యాంక్‌ల నిర్మాణం కోసం రూ.56 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏదిఏమైనా గతపదిరోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంపై గ్రామస్థుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.