చెరువులకు జలకళ
ABN , Publish Date - Jul 21 , 2025 | 10:44 PM
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులలో జలకళ సంతరించుకుంది. కానీ ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని కొత్తపల్లిలో కోడలి చెరువులో నుంచి నీరు వృథాగా పోతుంది.
ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం
కొత్తపల్లిలో చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు
కట్టడికి గ్రామస్థులు ప్రయత్నించినా లేని ఫలితం
పెద్దారవీడు, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులలో జలకళ సంతరించుకుంది. కానీ ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని కొత్తపల్లిలో కోడలి చెరువులో నుంచి నీరు వృథాగా పోతుంది. అధికారులకు సమాచారం అందించినా స్పందించక పోవడంతో గ్రామస్థులే ఏకమై నీరు వృథాగా పోవడాన్ని అరికట్టాలని ప్రయత్నించానా ఫలితం లేకుండా పోయింది.
20 ఏళ్ల తర్వాత నిండిన అత్తాకోడళ్ల చెరువులు
అధికారుల నిర్లక్ష్యం
మండలంలోని చెరువులన్నీ చాలా ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకున్నారు. ముఖ్యంగా కొత్తపల్లిలోని అత్తా, కోడళ్ల చెరువులు ప్రాముఖ్యత ఉన్నవి. శుక్ర, ఆదివారం కురిసిసన వర్షాలకు రెండూ చెరువులు పూర్తిగా నిండాయి. గతంతో కోడలి చెరువు, అత్త చెరువులకు పెద్దారవీడు, దేవరాజుగట్టు రహదారి కింద నుంచి నీరు పోయేందుకు అనుకూలంగా కాల్వ ఉండేది. కానీ గత వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణలో భాగంగా నూతన రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అప్పడు కాంట్రాక్టర్ కాల్వను పూడ్చేసి రోడ్డును నిర్మించారు. దీంతో రెండు చెరువులకు నీరు పారే కాల్వ పూడి పోయింది.
వృథాగా పోతున్న నీరు
మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కోడలి చెరువు పూ ర్తిగా నిండిపోయింది. అత్త చెరువుకుపై అంచులదాకా నీరు చేరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అత్త, కోడలి చెరువులకు ఉన్న కాల్వ పూడి పోయింది. దీంతో కోడలి చెరువు నుంచి అత్త చెరువుకు చేరాల్సిన నీరు వృథాగా బయటకు పోతుంది.
స్పందించని అధికారులు.. గ్రామస్థుల ప్రయత్నం విఫలం
కొత్తపల్లిలో వృథాగా నీరు పోవడాన్ని అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారులు స్పందించలేదు. సమాచారం ఇచ్చినా అధికారులు పట్చించుకోక పోవడంతో గ్రామస్థులు ఏకమై నీరు వృథాగా పోవడాన్ని అరికట్టడానికి ఎక్స్‌కవేటర్‌తో ప్రయత్నం చేశారు. రోడ్డు విస్తరణ సమయంలో కాంట్రాక్టర్ రోడ్డు కింది ఉన్న కాల్వను పూర్తిగా పూడ్చివేయడంతో గ్రామస్థుల ప్రయత్నం ఫలించలేదు. దీంతో కోడలి చెరువులో నీరు వృథాగా పోతూనే ఉంది. ఉన్నతాధికారులు స్పందించి అత్త, కోడలి చెరువుల మధ్య ఉన్న కాల్వను పునరుద్ధరించి నీరు వృథాగా పోవడాన్ని నియంత్రించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
చెరువులకు చేరిన వాన నీరు
ఎర్రగొండపాలెం రూరల్ : వరుసగా మూడు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు వాన నీటితో కళకళాడుతున్నాయి. మండలంలోని బోయలపల్లి, గురిజేపల్లి, అమానిగుడిపాడు, రామసముద్రం గ్రామాలలోని చెరువులకు నీరు చేరుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల చెరువులు నిండుతున్నాయి. ఈ చెరువులకు నీరు చేరి నిండితే బోర్లల్లో నీరు శాతం పెరుగుతుందని రైతులు చెప్తున్నారు. బోర్లలో నీరు పెరిగితే వేసిన పంటలకు ఇబ్బందులు లేకుండా సాగు చేసుకోవచ్చునని అంటున్నారు. ఆయా గ్రామాలలోని చెరువుల కింద వందల ఎకరాల్లో కంది, పత్తి, మిరప తదితర అపరాలను రైతులు సాగు చేస్తారు.