Share News

జలకళ

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:30 AM

వానలు, సమృద్ధిగా వస్తున్న సాగర్‌ జలాలతో జిల్లా జలకళను సంతరించుకుంది. పశ్చిమంలో ప్రత్యేకించి నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో వాగులు, వంకలు వర్షపు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పుప్రాంతంలోని గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి.

జలకళ
నిండకుండలా ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌

ఒకవైపు జోరుగా వర్షాలు.. మరోవైపు సాగర్‌ నీరు రాక

నిండుకుండలా గుండ్లకమ్మ

అదేస్థాయిలో రామతీర్థం

పశ్చిమాన పొంగుతున్న వాగులు, వంకలు

గుండ్లకమ్మ, పాలేరు, ముసిల్లోనూ ప్రవాహం

వానలు, సమృద్ధిగా వస్తున్న సాగర్‌ జలాలతో జిల్లా జలకళను సంతరించుకుంది. పశ్చిమంలో ప్రత్యేకించి నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో వాగులు, వంకలు వర్షపు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పుప్రాంతంలోని గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. గుండ్లకమ్మ, పాలేరు, ముసిలకూ వరద వస్తుండగా పలుచోట్ల ఆ నదులలో కలిసే అనేక వాగులు, వంకల్లో భారీగా ప్రవాహం కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల చెరువుల్లోకి నీరు చేరింది. సాధారణంగా ఈ తరహా వాతావరణం సజావుగా వర్షాలు కురిసి.. అదేస్థాయిలో సాగర్‌ నీటి సరఫరా జరిగితే సెప్టెంబరు ఆఖరు నుంచి కనిపిస్తుంది. అలాంటిది ఈ ఏడాది ఆగస్టులోనే నెలకొంది.

ఒంగోలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవలి వరకు సకాలంలో వర్షాలు కురవఞ0 పంటల సాగు ఆశించిన మేర ముందుకు సాగలేదు. గత వారం నుంచి ఒకవైపు వర్షాలు, మరోవైపు ముందస్తుగా సాగర్‌ నీటి రాకతో నీటి వన రులు జలకళను సంతరించుకుంటున్నాయి. పశ్చిమాన కుండపోత వానలతో తొనికిసలాడుతున్నాయి. జిల్లాలో సాధారణంగా జూన్‌ ఆరంభం నుంచి ఆగస్టు వరకు సుమారు 237.8 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈసారి ఇప్పటివరకు సుమారు 203 మి.మీ మేర వర్షం కురిసింది. ఈనెలలో ఇంకా 10 రోజులు ఉండగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే జూన్‌లో 35శాతం లోటు, జూలైలో అధికంగా వర్షం పడినప్పటికీ అదునులో కురవకపోవడం, ఈ నెలలో తొలి రెండు వారాలు వాన జాడలేకపోవంతో పంటల సాగు ముందుకు సాగలేదు. దాని వల్ల ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకూ 20శాతం మించి పంటలు సాగు చేయలేకపోయారు.

అల్పపీడన ప్రభావంతో..

అల్పపీడన ప్రభావంతో వారం నుంచి పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షా లతో నీటి వనరులు కళకళలాడుతున్నాయి. ఈనెలలో 92.0 మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఇప్పటివరకు 53.3 మి.మీ కురవాలి. అలాంటిది 73.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అందులో ఈ వారంలోనే సుమారు 50 మి.మీపైన కురిసింది. మార్కాపురం, గిద్దలూరు కనిగిరి, కొండపి, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లోని అత్యధిక మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి నల్లమల అటవీ సమీప మండల్లోనూ నల్లమల అడవిలోనూ ఇటీవల కుండపోత కురిసింది. దీంతో అటవీ సమీపంలో ఉండే తీగలేరు వాగు, దొంగల వాగు, జంపలేరు, సగిలేరు, ఎమిలేరు వంటి వాటికి భారీగా వరద నీరు వస్తోంది. గుండ్లకమ్మలోనూ భారీగా నీరు ప్రవహిస్తోంది.

కంభం చెరువుకు నీరు

రాచర్ల మండలంలోని రామన్న కత్తువలోకి భారీగానే నీరు చేరగా అక్కడి నుంచి కంభం చెరువుకు, గుండ్లకమ్మ ద్వారా నీరు వస్తోంది. జంపలేరు ద్వారా కూడా కంభం చెరువుకు ప్రవాహం కొనసాగుతోంది. దోర్నాల, పెద్దారవీడు, మార్కాపురం, పొదిలి మండలాలతోపాటు కనిగిరి, కొండపి, దర్శి నియోజవకర్గాల్లోని పలు చెరువులకు నీరు చేరింది. పాలేరు, ముసి నదుల్లోనూ నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. దర్శి నియోజకవర్గం ద్వారా గుండ్లకమ్మకు నీరు వచ్చే చిలకలేరు, దోర్నపు వాగుల్లో ప్రవాహం పెరిగింది.

సాగర్‌ ఆయకట్టు కళకళ

సాగర్‌ కాలువల నీరు సాధారణం కన్నా ఈ ఏడాది దాదాపు నెల ముందే వచ్చింది. అది కూడా కాలువల సామర్థ్యం మేర సరఫరా జరిగింది. ప్రస్తుతం కూడా కాలువల్లో భారీగానే నీటి ప్రవాహం ఉంది. దీంతో వాటి ఆధారంగా జిల్లాలో దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో ఉన్న 200పైగా నోటిఫైడ్‌, నాన్‌ నోటిఫైడ్‌ చెరువులు, ఈ ప్రాంతాల్లో ఉండే వాగులు, వంకల్లో నీరు చేరింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలోని పెద్ద ఎస్‌ఎస్‌ ట్యాంకులు కూడా నిండాయి. సాగర్‌ కాలువ దిగువన చీమకుర్తి సమీపంలో ఉన్న రామతీర్థం రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. సుమారు 1.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆ రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండటంతో దిగువ కాలువలకు కూడా నీటిని వదిలారు.

Updated Date - Aug 20 , 2025 | 01:30 AM