Share News

కొట్టుకుపోయిన రహదారులు దెబ్బతిన్న నేల చప్టాలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:08 AM

మండలంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో పలు ప్రధాన గ్రామాలకు వెళ్లే రహదారులు, నేల చప్టాలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఆ వైపు కూడా కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో వాహన చోదకులు, ఆయా గ్రామాల ప్రజలు ఆయా రహదారులపై ప్రయాణం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొట్టుకుపోయిన రహదారులు  దెబ్బతిన్న నేల చప్టాలు
మొంథా తుఫాన్‌ ధాటికి దెబ్బతిన్న తమ్మలూరు, పసుపుగల్లు మధ్య చిలకలేరు వాగు పై ఉన్న చప్టా (ఫైల్‌)

పట్టించుకోని అధికారులు

ముండ్లమూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో పలు ప్రధాన గ్రామాలకు వెళ్లే రహదారులు, నేల చప్టాలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఆ వైపు కూడా కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో వాహన చోదకులు, ఆయా గ్రామాల ప్రజలు ఆయా రహదారులపై ప్రయాణం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముండ్లమూరు నుంచి వేంపాడు మధ్య చిలకలేరు వాగుపై దశాబ్దాల క్రితం నిర్మించిన నేల చప్టా తుఫాన్‌ ధాటికి కొట్టుకు పోయింది. అలాగే ముండ్లమూరు నుంచి తమ్మలూరు వెళ్లే ప్రధాన రహదారిపై చిలకలేరు మీద నిర్మించిన బ్రిడ్జి సైతం దెబ్బతింది. పసుపుగల్లు నుంచి తమ్మలూరు వెళ్లే ప్రధాన రహదారి వాగుపై నిర్మించిన నేల చప్టా పూర్తిగా దెబ్బతింది. కనీసం పశు పోషకులు కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో రెండు గ్రామాల ప్రజలు, పశు పోషకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పసుపుగల్లు నుంచి నడింపల్లివారి కండ్రిక వెళ్లే ప్రధాన రహదారిపై చిలకలేరు వాగుపై ఇటీవల నిర్మించిన నేల చప్టా ధ్వంసమే కాక పలుచోట్ల ఆ రహదారి కోసుకుపోయింది. భీమవరం నుంచి మక్కెనవారిపాలెం వెళ్లే ప్రధాన రహదారి, నందమూరి నగర్‌ నుంచి ముప్పరాజువారిపాలెం వెళ్లే పంచాయతీ రహదారి, వేములబండ నుంచి పసుపుగల్లు వచ్చే ప్రధాన రహదారి చిలకలేరు వాగులపై ఉన్న రెండు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమామహేశ్వర అగ్రహారం నుంచి చింతలపూడి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పూర్తిగా పలు చోట్ల దెబ్బతింది. పూరిమెట్ల నుంచి మక్కెనవారిపాలెం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి కిలో మీటరు పైన కోసుకుపోయింది. దీంతో వాహన చోదకులు అతి కష్టం మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొంథా తుఫాన్‌ ప్రభావంతో మండలంలో ప్రధాన వాగులపై ఉన్న బ్రిడ్జీలు, నేల చప్టాలు, పంచాయతీ రహదారులు దెబ్బతిని ప్రయాణం అస్తవ్యస్తంగా తయారైంది. రాత్రుల సమయాల్లోనైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహన చోదకులతో పాటు మండల ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:08 AM