హెచ్చరిక బోర్డులు మాయం..!
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:23 PM
కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు. దీంతో అక్రమార్కుల దృష్టిలో వారు అలుసైపోతున్నారు. ఒకప్పుడు మేజిస్టీరియల్ అధికారాలు కలిగిన తహసీల్దార్‌లు ఇప్పుడు చూస్తూ ఉండిపోతున్నారు. దీంతో ఆక్రమణదారులు నిత్యం చెలరేగిపోతున్నారు.
అధికారుల స్పందన అంతంతమాత్రం
యథేచ్ఛగా ఆక్రమణలు
పటిష్ట చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
పొదిలి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు. దీంతో అక్రమార్కుల దృష్టిలో వారు అలుసైపోతున్నారు. ఒకప్పుడు మేజిస్టీరియల్ అధికారాలు కలిగిన తహసీల్దార్‌లు ఇప్పుడు చూస్తూ ఉండిపోతున్నారు. దీంతో ఆక్రమణదారులు నిత్యం చెలరేగిపోతున్నారు. దినపత్రికల్లో భూ ఆక్రమణలపై కథనాలు రాగానే అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను అక్రమార్కులు మాయం చేస్తూ.. కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో మార్కాపురం అడ్డరోడ్డు పొదిలి మార్కాపురం ప్రధాన రహదారికి ఆనుకొని సర్వే నెంబర్ 83లో ఉన్న కోట్ల విలువ చేసే 23 సెంట్ల ప్రభుత్వ భూమిని అప్పటి ప్రజా ప్రతినిధులు ఆక్రమించుకున్నారని పత్రికల్లో రావడంతో అప్పటి తహసీల్దార్ తూతూమంత్రంగా రక్షణ బోర్డును ఏర్పాటు చేశారు. రెండురోజులకే ఆ బోర్డులు మాయమయ్యాయి. ఆ తరువాత ఆస్థలం ఏమైౖందో రెవెన్యూ అధికారులకు తెలియలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఆ స్థలం నాదంటే నాదంటూ పలువురు తెరపైకి వచ్చారు. అలాగే ఈఏడాది మేలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన తహసీల్దార్ కృష్ణారెడ్డి సర్వే నెంబర్ 217లో 3ఎకరాల 6సెంట్లు, 219/2లో 1 ఎకరం 86సెంట్లు భూమి (గయాల్‌గా) ఉందని వీఆర్వో మోషాతో బోర్డును ఏర్పాటు చేయించారు. ఆ తరువాత వీఆర్వోగానీ, రెవెన్యూ సిబ్బందిగానీ పట్టించుకోకపోవడంతో ఒకబోర్డు చిరిగి గాలికిపోయింది. మరో బోర్డు అసలు ఏర్పాటు చేసిన ప్రదేశంలో లేదు. ప్రభుత్వ భూముల్లో అలాంటి బోర్డులను ఏర్పాటు చేస్తే ఉంటాయా అనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కంభాలపాడు పంచాయతీలో 45/1లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంత సచివాలయం ఏర్పాటు చేశారు. మరికొంత భూమి ఉంది దీన్ని ఆక్రమణదారుడు నాది అంటూ గతంలో చూట్టూ కాలువ తీశాడు. స్పందించిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆక్రమణ జరిగిన ప్రదేశానికి వెళ్లి ప్రభుత్వ భూమిగా గుర్తించారు. పంచాయతీ అధికారుల సమక్షంలో సర్వే చేసి పంచాయతీకి అప్పగించారు. అయిన ఆక్రమణదారుడు కందిని సాగుచేశాడు. కందిపంట దున్ని మరలా పొలంసాగు చేయడానికి దక్కిదున్ని సిద్ధం చేశాడు. కానీ అధికారులు ఇప్పటికీ ఆ పొలంలో ఎటువంటి హెచ్చరిక బోర్డ్‌లూ ఏర్పా టు చేయలేదు, చర్యలు కూడా లేవు. ఇప్పటికైనా రెవెన్యూ, నగరపంచాయతీ అధికారులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు, పొలాలు అన్యాక్రాంతం కాకుండా గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కృష్ణారెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డిని వివరణ కోరగా.. దీనిపై చర్చించి స్థిరంగా ఉండేలా బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.