విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వార్డెన్లపై వేటు
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:38 PM
వసతిగృహ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై వేటు తప్పదని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మీ నాయక్ హెచ్చరించారు.
పలు వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీడీ లక్ష్మీనాయక్
కంభం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వసతిగృహ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై వేటు తప్పదని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మీ నాయక్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కంభంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయా హాస్టళ్లలో వంటగదులు, తాగునీటి వసతులు, మరుగుదొడ్లు, స్టోర్ గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రతినెలా వైద్యులు వస్తున్నారా, వారి ఆరోగ్య పరిస్థితులను, కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుర వసతి గృహ అద్దె భవనంలో విద్యార్థులకు సౌకర్యంగా లేకపోవడం గమనించి వేరే భవనాన్ని చూడాలని వార్డెన్‌కు సూచించారు. డైరెక్టర్ వెంట వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీరామ నాయక్, హేమలత, సిబ్బంది పాల్గొన్నారు.
బాలికల వసతిగృహం ఆకస్మిక తనిఖీ
మార్కాపురం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక తర్లుపాడు రోడ్డులోని ప్రభుత్వ బాలికల వసతిగృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలోని వంటగది, స్టోర్‌రూమ్, తాగునీటి సౌఖర్యాలు, మరుగుదొడ్లు తదితరాలను క్షణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో అల్పాహారం తిన్నారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ సంరక్షణాధికారిణి బి.మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.