ఇరిగేషన్‌లో వార్
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:22 AM
ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సాగునీటి పంపిణీలో ఎవరికి వారు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందిపెడుతున్నారని డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌తోపాటు నీటి సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు.
అధికారుల మధ్య విభేదాలు
సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం
నీటి కొలతల్లో సరికాని తేడాలు
డీసీ, నీటిసంఘాల అధ్యక్షుల ఆగ్రహం
ఆయకట్టు రైతుల అవస్థలు
దర్శి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సాగునీటి పంపిణీలో ఎవరికి వారు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందిపెడుతున్నారని డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌తోపాటు నీటి సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. దర్శి ఎన్‌ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో నెలకొన్న ఈ పరిణామాలతో ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాకు వాటా మేరకు రావాల్సిన నీరు విడుదల కావడం లేదు. తక్కువగా విడుదల అవుతున్నందున చివరి ఆయకట్టు భూములకు అందడంలేదు. కొద్దిరోజుల క్రితం పమిడిపాడు బ్రాంచ్ కాలువకు నీటి పరిమాణం పెంచాలని డీసీ అధ్యక్షుడితోపాటు పలువురు నీటి సంఘాల అధ్యక్షులు ఇరిగేషన్ అధికారులను కలిసి డిమాండ్ చేశారు. ఎగువన వస్తున్న నీటి పరిమాణం ప్రకారం అందరికీ సమన్యాయం చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్పగా పీబీసీ పరిధిలోని చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందిపడుతున్నారని, నీటి పరిమాణం పెంచాలని పట్టుబట్టారు. దీంతో అధికారులకు, డీసీ అధ్యక్షుడి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ అంశం ఇలా ఉండగా సిబ్బంది మధ్య సమన్వయం లేక నీటి పంపిణీ కూడా సక్రమంగా జరగడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రీడింగ్‌లలో తేడాలు ఇప్పటి వరకు సరిచేయలేదు. సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలు (ప్రకాశం బార్డర్) వద్ద ఉన్న రీడింగ్, దర్శి బ్రాంచ్ కాలువ హెడ్ వద్ద ఉన్న రీడింగ్, పమిడిపాడు బ్రాంచ్ హెడ్ వద్ద రీడింగ్‌లలో తేడాలు ఉన్నాయని గత కొంతకాలంగా అధికారులే చెబుతున్నారు. ఆ తేడాల వలన మనకు విడుదలవుతున్న నీటి పరిమాణం సక్రమంగా వస్తుందా? లేదా? అనే విషయం కూడా అనుమానాస్పదమవుతోంది. దీంతో చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్ కాలువకు నీరు సక్రమంగా అందక చివరి ఆయకట్టు భూముల రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా అధికారులు కూడా ఏ కారణం చేతనో లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముంది.
ఆరు నెలలగా బిల్లులు చేయని అధికారులు
దర్శి-1 సబ్ డివిజన్ పరిధిలో చేసిన కాలువల మరమ్మతులకు బిల్లులు నేటి వరకు చేయలేదు. సాగర్ జలాలు విడుదల చేయకముందు సుమారు 6 నెలల క్రితం పనులు చేశారు. ఇప్పటివరకు బిల్లులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆరోపించారు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం వలనే బిల్లులు చేయటంలో కూడా జాప్యం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు చేసిన నిర్వాహకులు తాము నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దర్శి ఈఈ విజయలక్ష్మిని వివరణ కోరగా పమిడిపాడు బ్రాంచ్ కాలువకు నీటి పరిమాణం పెంచాలని డీసీ ప్రెసిడెంట్‌తోపాటు పలువురు నీటి సంఘాల అధ్యక్షులు తమ వద్దకు వచ్చి వాదులాటకు దిగారన్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటి పరిమాణం తెలిపి వాస్తవ పరిస్థితి వివరించే ప్రయత్నం చేసినా వారు వినకుండా దురుసుగా మాట్లాడారని చెప్పారు. బిల్లుల చెల్లింపులో జాప్యానికి కారణాలను అడగ్గా తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టినందున ఈ విషయం కొద్దిరోజుల క్రితమే తెలిసిందన్నారు. సంబంధిత సబ్ డివిజన్‌లోని అధికారులను పిలిచి త్వరగా బిల్లులు చేయాలని సూచించినట్లు ఆమె వివరించారు.