రుణం కోసం నిరీక్షణ
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:28 AM
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అంటూ హడావుడి చేశారు. దరఖాస్తులు స్వీకరించారు. యూనిట్లను ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేశారు. వారికి ప్రభుత్వం నుంచి రుణ మంజూరు ఉత్తర్వులు కూడా అందజేశారు. ఆతర్వాత ముఖం చాటేశారు.
జిల్లాలో 2,050 మంది లబ్ధిదారులు
ప్రభుత్వ తీరుతో అంతా అయోమయం
నెలల తరబడి ఎదురుచూపులు
బ్యాంకులు, బీసీ కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు
సబ్సిడీ సొమ్ము విడుదల కాలేదని సమాధానం
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అంటూ హడావుడి చేశారు. దరఖాస్తులు స్వీకరించారు. యూనిట్లను ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేశారు. వారికి ప్రభుత్వం నుంచి రుణ మంజూరు ఉత్తర్వులు కూడా అందజేశారు. ఆతర్వాత ముఖం చాటేశారు. నెలల తరబడి రుణాలు అందజేయకుండా లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తున్నారు. తొలుత ఎందుకు అంత హడావుడి చేశారో... తీరా మంజూరు ఉత్తర్వులు ఇచ్చి యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు విడుదల చేయకుండా ఎందుకు మిన్నకున్నారో అర్థం కాక లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. అటు బ్యాంకులు, ఇటు బీసీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఒంగోలునగరం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని ప్రజాప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు అవసరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసింది. యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో మీనమేషా లు లెక్కిస్తోంది. దీంతో లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఇచ్చిన మంజూరు ఉత్తర్వులు చేతపట్టుకుని అటు బ్యాంకులు, ఇటు బీసీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. మన జిల్లాకు సంబంధించి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రుణాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీ కార్పొరేషన్‌తోపాటు కాపు, రెడ్డి, కమ్మ, బలిజ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కార్పొ రేషన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది.
ఏప్రిల్ 11న మంజూరు ఉత్తర్వులు
ఫిబ్రవరి, మార్చి మాసాల్లో దరఖాస్తులు స్వీకరించిన వారిలో అర్హత ఉన్న 2,050 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన జిల్లా కేంద్రంలో రుణ మేళా ఏర్పాటు చేసి మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఒంగోలు కలెక్టరేట్‌లో యూనిట్ల ప్రదర్శన ఏర్పాటు చేసి లబ్ధిదారులను వందల సంఖ్యలో సమీకరించి మంజూరు లేఖలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజేయస్వామి కూడా హాజరయ్యారు.
సబ్సిడీపై 115 రకాల యూనిట్లు
బీసీ కార్పొరేషన్‌తోపాటు మరో ఏడు కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీపై 115 రకాల యూనిట్లను అందజేసేందుకు దరఖాస్తులను స్వీకరించి మంజూరు ఉత్తర్వులను అందజేసింది. అందులో ఆటోలు, ట్రాక్టర్లు, జనరిక్ మందుల దుకాణాలు, చేతివృత్తుల వారికి అవసరమైన యూనిట్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి 45శాతం సబ్సిడీ, మరి కొన్నింటికి 50శాతం సబ్సిడినీ ప్రకటించారు. అత్యధికంగా రూ.10లక్షల యూనిట్ విలువతో జనరిక్ మందుల దుకాణాలు ఉన్నాయి.
సబ్సిడీ విడుదల కాక నిలిచిపోయిన గ్రౌండింగ్
బీసీ కార్పొరేషన్ అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలు ఆయా జిల్లాల్లోని సంబంధిత బ్యాంకులకు వెళ్లాయి. బ్యాంకుల్లో రుణ ఖాతాలు కూడా ప్రారంభమయ్యాయి. యూనిట్లను సరఫరా చేసే సంస్థల నుంచి లబ్ధిదారులు కొటేషన్లను కూడా తెచ్చుకున్నారు. వీటిని బ్యాంకుల వద్ద అందజేసేందుకు తిరుగుతుంటే బ్యాంకు అధికారులు ప్రభుత్వం నుంచి ఇంకా సబ్సిడీ నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. కార్పొరేషన్ నుంచి బ్యాంకులకు సబ్సిడీ నిధులు విడుదలైతే అప్పుడు గ్రౌండింగ్ చేస్తామంటూ లబ్ధిదారులను వెనక్కి పంపుతున్నారు. రుణ మంజూరు ఉత్తర్వులు అందుకున్న లబ్ధిదారులు ఐదు నెలల నుంచి యూనిట్ల గ్రౌండింగ్ కోసం బ్యాంకులు, బీసీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు నిధులు విడుదలవుతాయో కూడా తాము చెప్పలేమంటూ ఆ కార్యాలయం నుంచి సమాధానం ఎదురవుతోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.