మిస్టరీగా వీఆర్వో అదృశ్యం
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:18 PM
నాలుగు నెలల క్రితం అదృశ్యమైన వీఆర్వో ఆచూకీ నేటికీ లభించలేదు. కుటుంబసభ్యులకు ఆందోళన తప్ప చిన్నపాటి క్లూ కూడా దొరకక పోవటం, విచారణలో ఎటువంటి పురోగతి లేకపోవటంతో ఎన్నాళ్లైనా ఇంతేనా అన్నట్లుగా ఈ కేసు నడుస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసిన కుటుంబ సభ్యులు తమ గోడు చెప్పుకునేందుకు కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు.
నాలుగునెలలుగా దొరకని ఆచూకీ
క్లూ కూడా దొరకలేదంటున్న పోలీసులు
ఆందోళన చెందుతున్న కుటుంబీకులు
త్రిపురాంతకం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలల క్రితం అదృశ్యమైన వీఆర్వో ఆచూకీ నేటికీ లభించలేదు. కుటుంబసభ్యులకు ఆందోళన తప్ప చిన్నపాటి క్లూ కూడా దొరకక పోవటం, విచారణలో ఎటువంటి పురోగతి లేకపోవటంతో ఎన్నాళ్లైనా ఇంతేనా అన్నట్లుగా ఈ కేసు నడుస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసిన కుటుంబ సభ్యులు తమ గోడు చెప్పుకునేందుకు కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు.
త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న పాలుట్ల వెంకట నాగరాజరావు ఫిబ్రవరి నెలలో కనిపించకుండా పోయాడు. ఆచూకీ తెలియలేదని భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఫిబ్రవరి 14న త్రిపురాంతకం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కనిపించకుండా పోయిన నాగరాజు మోటారుబైక్ ఎన్‌ఎ్‌స కెనాల్ కాలువ కట్టపై ఉన్నట్లు గుర్తించారు. ఆయన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు వెంటనే ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను రంగంలోకి దింపి కాలువ పరిధిలో వెతికారు. దర్శి వరకు కాలువలో వెతికినా జాడ లభించకపోవటంతో అతను ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు ప్రాఽథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే నాగరాజారావు ఎక్కడ ఉన్నాడనేదానికి మాత్రం ఇప్పటికి నాలుగునెలలుగా సమాధానం లేదు.
లభించని ఆధారాలు
వీఆర్వో అదృశ్యానికి సంబంధించి ఎటువంటి క్లూ లభించకపోవటంతో ముందుకు వెళ్లలేక పోతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్నో కేసులు చాకచక్యంగా ఛేదిస్తున్న పోలీసులు ఈ కేసు పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వీఆర్వో నాగరాజరావు కొందరి వద్ద అప్పులు చేసి ఉన్నారని, వారికి సమాధానం చెప్పలేక అదృశ్యమయ్యాడనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ సమాధానం చెప్పుకోలేని అప్పులు చేసి ఉంటే అప్పు ఇచ్చిన వాళ్లు కూడా మౌనంగా ఉండరు కదా? వాళ్లు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు. అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. మొత్తానికి ఒకగ్రామ రెవెన్యూ అధికారి కనిపించకుండా పోతే అటు శాఖా పరంగా కానీ, ఇటు పోలీసులు కానీ విచారణపై ఎందుకు వేగం పెంచలేక పోతున్నారో వారికే తెలియాలి.