Share News

ఆర్టీసీ బస్సులకు నోచుకోని గ్రామాలు

ABN , Publish Date - Nov 22 , 2025 | 10:45 PM

ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన పల్లెవెలుగు బస్సులు జాతీయ రహదారులకే పరిమితమయ్యాయి. దీంతో పల్లె ప్రజలు రవాణా సదుపాయం కోసం అల్లాడిపోతున్నారు.

ఆర్టీసీ బస్సులకు నోచుకోని గ్రామాలు
ఆటోలో నిండుగా వెళ్తున్న ప్రయాణికులు

ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణికులు

పట్టించుకోని అధికారులు

కంభం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన పల్లెవెలుగు బస్సులు జాతీయ రహదారులకే పరిమితమయ్యాయి. దీంతో పల్లె ప్రజలు రవాణా సదుపాయం కోసం అల్లాడిపోతున్నారు. కంభం కేంద్రంగా అర్ధవీడు, బేస్తవారపేట, కంభం మండలాలలోని అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపించే పరిస్థితి కనిపించడం లేదు. కంభం మండలంలో కందులాపురం, ఎల్‌కోట, లింగోజిపల్లి, రావిపాడు, ఔరంగాబాద్‌, నర్సిరెడ్డిపల్లి, ఎర్రబాలెం, అర్ధవీడు మండలంలో బసిరెడ్డిపల్లి, బేస్తవారిపేట, మండలంలోని ఖాజీపురం, అగ్రహారం, తదితర గ్రామాలకు నేటికీ బస్సు సౌక ర్యం లేదు. ఆటోలే శరణ్యం. మండలంలో ఒకప్పుడు ఏ మారుమూల ప్రాంతం చూసినా ఎర్రబస్సులు తళుక్కుమనేవి. తర్వాత వాటి సంఖ్యను కుదించేశారు. వేరే దారి లేక ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానం మేరకు మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కానీ మారుమూల పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో పలు గ్రామాల మహిళా ప్రయాణికులు కూడా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో కార్మికులు ఆర్టీసీ కన్నా అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణీకుల జేబులకు చిల్లులు పడుతోంది. దీనికి తోడు ఆటో నిండే వరకు గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కిస్తుండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఆటో ఎక్కినా గమ్యం చేరుకుంటామన్న గ్యారెంటీ లేకపోయిందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. గతంలో కందులాపురం, రావిపాడు, అగ్రహారం తదితర గ్రామాలకు పల్లె బస్సులు వెళ్లేవి. మధ్యలో వాటి సర్వీసులను నిలిపి వేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి పల్లె ప్రాంతాలకు బస్సులు నడపాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 10:45 PM