Share News

ఆర్‌అండ్‌బీ శాఖపై విజి‘లెన్స్‌’!

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:06 PM

రోడ్లు, భవనాల శాఖపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. వివిధ అంశాలపై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆశాఖలో ఉద్యోగోన్నతుల కోసం ఇద్దరు ఉద్యోగులు అడ్డదారి తొక్కిన విషయం బహిర్గతమైంది. ఒకవైపు చదువు పేరుతో ఆ ఇద్దరూ సెలవు తీసుకొని, మరోవైపు సుమారు రూ.26లక్షల మేర జీతాలు డ్రా చేయడం విస్తుగొలుపుతోంది.

ఆర్‌అండ్‌బీ శాఖపై   విజి‘లెన్స్‌’!
ఆర్‌అండ్‌బీ కార్యాలయం

వివిధ అంశాలపై విచారణ

వెలుగులోకి విస్తుగొలుపే విషయాలు

ఉద్యోగోన్నతుల కోసం ఇద్దరు ఉద్యోగుల అడ్డదారి

నకిలీ ధ్రువీకరణపత్రాలతో ప్రయోజనం

పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడి

మరికొన్ని విషయాలపైనా లోతుగా పరిశీలన

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రోడ్లు, భవనాల శాఖపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. వివిధ అంశాలపై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆశాఖలో ఉద్యోగోన్నతుల కోసం ఇద్దరు ఉద్యోగులు అడ్డదారి తొక్కిన విషయం బహిర్గతమైంది. ఒకవైపు చదువు పేరుతో ఆ ఇద్దరూ సెలవు తీసుకొని, మరోవైపు సుమారు రూ.26లక్షల మేర జీతాలు డ్రా చేయడం విస్తుగొలుపుతోంది. ఆర్‌అండ్‌బీలో మరికొన్ని విషయాలపైనా విజిలెన్స్‌ అధికారులు లోతైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే..

ఆర్‌అండ్‌బీ కనిగిరి డివిజన్‌లో ప్రింటింగ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఒకరు, అటెండర్‌గా పనిచేస్తున్న మరొకరు ఉద్యోగోన్నతుల కోసం మోసం చేసినట్లు తెలిసింది. వారిద్దరూ రెండేళ్ల చదువు కోసం ఈఎన్‌సీ నుంచి స్టడీ లీవు పొందారు. చీరాలలోని ఒక ఐటీఐ కాలేజీలో 2020-22 బ్యాచ్‌ కింద రెగ్యులర్‌ స్టూడెంట్స్‌గా జాయిన్‌ అయ్యారు. తొమ్మిది నెలల అనంతరం తిరిగి ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత 13 నెలలకు జీతాలు డ్రా చేశారు. రెండేళ్లు చదవాల్సిన ఐటీఐ సివిల్స్‌ను తొమ్మిది నెలలు మాత్రమే చదివిన వారు కోర్సును పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు పుట్టించినట్లు తెలిసింది. అనంతరం ఉద్యోగోన్నతుల కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కార్యాలయంలో కొందరు అధికారులు సహకరించినట్లు తెలిసింది.


వెలుగులోకి ఇలా..

ఆ ఇద్దరు ఉద్యోగులు సమర్పించినవి నకిలీ సర్టిఫికెట్‌లు అని గుర్తించిన కార్యాలయంలోని కొందరు వ్యక్తులు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఒంగోలు విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. నగరంలోని ఆర్‌అండ్‌ ఎస్‌ఈ కార్యాలయానికి వెళ్లి ఇద్దరు ఉద్యోగుల విద్యార్హతలు, సర్వీస్‌ రికార్డులు, పేస్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ చేసిన వారు ఉద్యోగోన్నతుల కోసం ఇద్దరు ఉద్యోగులు మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

ఇతర అంశాలపైనా విజిలెన్స్‌ కన్ను

ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఈఈ, డివిజన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న పలు అంశాలపైన కూడా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కన్నేసినట్లు తెలిసింది. కేవలం ఉద్యోగోన్నతుల విషయంలోనే కాకుండా పలు పనులకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, అనుమతులకు సంబంధించి చోటుచేసుకుంటున్న గూడు పుఠానీపైనా దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో మున్ముందు ఏఏ అంశాలు వెలుగులోకి వస్తాయోనని ఆశాఖలోని ఉద్యోగులు వణికిపోతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:07 PM